తెలంగాణలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా 200కి పైగా కేసులు నమోదవుతుండగా తాజాగా నేడు కూడా కొత్తగా 269 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 5,675కి చేరింది. ఇందులో 2,412 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,071 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 192 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

 

అయితే రోజున ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 214 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 13 కేసులు, వరంగల్ అర్బన్‌లో 10 కేసులు, కరీంనగర్‌లో 8 కేసులు, జనగామ, ములుగులో 5 కేసులు, సంగారెడ్డి, మెదక్‌లో 3 కేసులు, వనపర్తి, మేడ్చల్‌లో 2 కేసులు, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలలో ఒక్కో కేసు నమోదు అయ్యింది.

 

ఇదిలా ఉండగా మొట్టమొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం రోజు వారీ టెస్టుల వివరాలను వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది…. రోజు మొత్తం 1096 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 269 మందికి పాజిటివ్ వచ్చినట్టు హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 45,911 టెస్ట్‌లు చేసినట్లు తెలుస్తుంది.

 

ఇకపోతే మొత్తం కరోనా వైరస్ సోకిన వారిలో ఇది వరకే దీర్ఘ కాలిక రోగాలు ఉన్నవారికే ఇది ఎక్కువ ప్రాణాంతకం అన్న విషయం తెలిసిందే. అయితే ఇతర వ్యాధులతో పోలిస్తే హైపర్ టెన్షన్ అనగా బి.పి మరియు డయాబెటిస్ అనగా షుగర్ వ్యాధి ఉన్న వారే ఎక్కువగా చనిపోవడం గమనార్హం.

 

మొత్తం రెండు వ్యాధులతో బాధపడుతున్న వారు ఇతర వ్యాధిగ్రస్థులతో పోలిస్తే 40 శాతం ఎక్కువగా మంది కరోనా వైరస్ ధాటిని తట్టుకోలేక చనిపోయారని ఒక అధ్యయనం వెల్లడించింది. అలాగే వారు ఒక 50 ఏళ్ళ వయసు దాటారంటే దేవుడి పై భారం వేయాల్సిందేనట. కావున బీపీ షుగర్ ఉన్న వారు ఎక్కువగా బయట తిరగకపోవడం మంచిదని నిపుణుల సలహా.

మరింత సమాచారం తెలుసుకోండి: