ఎప్పుడూ లేని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకుల వ్యవహార శైలి తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తోంది. అసలు ప్రాంతీయ పార్టీల్లో అధినేత నిర్ణయమే ఫైనల్ గా ఉంటుంది. వారు చెప్పిందే జరుగుతుంది. వారి వ్యవహారశైలి ఏ విధంగా ఉన్నా, ఆ పార్టీ నేతలు నోరు మెదిపేందుకు అవకాశం ఉండదు. ఆ విధంగానే మొదటి నుంచి వైసీపీలో జగన్ మాటకు ఎదురు లేకుండా ఉంటూ వస్తోంది. సొంత పార్టీ నేతలు ఎవరూ  పార్టీ గీత దాటకుండా పూర్తిగా అదుపు ఆజ్ఞలలో ఉండేవారు. కానీ ఇప్పుడు వైసిపి అధికారంలో ఉంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలుగుతూ ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పి కొట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా అసమ్మతి గళం విప్పుతున్న సంఘటనలు జగన్ కు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. 

 

IHG


ఏదైనా పొరపాటు ఉంటే పార్టీ కీలక నేతలతో చర్చించి, క్లారిటీ తీసుకునే అవకాశం ఉన్నా, వారు అలా చేయకుండా మీడియా ద్వారా సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తుండడం పై జగన్ సీరియస్ గా దృష్టిపెట్టారు. ముఖ్యంగా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో జగన్ చాలా సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. రఘురామకృష్ణ రాజు బిజెపిలోకి వెళ్లేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు అనే అనుమానం లో బీజేపీ ఉంది. ఆయన నిత్యం వైసిపి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్న తీరు, సాక్షాత్తు అధినేత వ్యవహారశైలిపై ప్రశ్నిస్తూ ,మీడియా ద్వారా విమర్శలు చేస్తున్న విధానాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 


ఈ నేపధ్యం లో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ తీసుకున్న తర్వాత సస్పెండ్ చేస్తే మంచిదని, లేకపోతే ఆయన మరింతగా ప్రభుత్వంపై విమర్శలు చేసి పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చుతాడనే అభిప్రాయంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు కి బిజెపి అండదండలు ఉండడంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, వారి సూచనల ప్రకారమే ఇప్పుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని జగన్ భావిస్తున్నారు. ఇప్పుడు రఘు రామకృష్ణం రాజు పై చర్యలు తీసుకోకపోతే, పార్టీలో మరికొంతమంది వచ్చి చేరే అవకాశం ఉందని, అప్పుడు పార్టీ పరువు మరింతగా దిగజారుతుందని భావిస్తున్న జగన్ త్వరలోనే రఘురామ కృష్ణంరాజు విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికీ రఘురామకృష్ణరాజు పై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. దీనికి ఆయన కూడా ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: