ఏపీ అసెంబ్లీ, శాస‌న‌మండ‌లి స‌మావేశాల సంద‌ర్భంగా కౌన్సిల్‌లో చోటు చేసుకున్న ప‌రిణామాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య జ‌రిగిన ఈ మాట‌ల యుద్ధంపై వివిధ ప‌క్షాలు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నాయి. తాజాగా, వైసీపీ నేత‌, ఏపీ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మండలిలో దాడులకు ప్రధాన కారణం నారా లోకేశ్‌ చౌదరేన‌ని ఆరోపించారు. సభలో యథేచ్ఛగా లోకేష్ ఫోటోలు, వీడియోలు తీస్తున్నాడని ఆరోపించారు. అసెంబ్లీలో బిల్‌ పాస్ చేసినా.. మండలిలో అడ్డుకొని తీరుతామని యనమల చెప్పారని గుర్తు చేసిన ఆయ‌న అసెంబ్లీ రూల్స్ తానే రాసినట్లు యనమల బిల్డప్ ఇస్తున్నార‌ని మండిప‌డ్డారు. అంగ బలం ఉందని మీ సంగతి చూస్తాం అన్నట్లుగా టీడీపీ ధోరణి ఉంద‌ని ఆరోపించారు. 

 

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ మండలిలో సంఘటనల గురించి మీడియాకు వివరించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చించి విలువైన సూచనలు, సలహాలు.. ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తుంటే చెప్పవచ్చని, సూచన చేయవచ్చున‌ని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో చర్చకు రాని చంద్రబాబు రాజధాని రైతులపై ప్రేమ చూపిస్తున్నట్లుగా నటిస్తున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. శాసనసభలో చంద్రబాబు చర్చ చేయరని, బిల్లుల్లో, బిజినెస్‌ రూల్స్‌లో పాల్గొనరని మంత్రి అన్నారు. మండలిలో అంగబలం ఉందని ఇక్కడ మీ సంగతి చూస్తామనట్లు టీడీపీ వాళ్ల ప్రవర్తన ఉందని వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ ఛైర్మన్‌ సీట్‌లో కూర్చున్నప్పటి నుంచి ప్రభుత్వ బిల్లులకు ప్రయార్టీ ఇవ్వాల్సిన బాధ్యత ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లపై ఉందని వెల్లంపల్లి శ్రీనివాస్ గుర్తు చేశారు. గతంలో ఛైర్మన్ తన‌‌ విచక్షణాధికారం అంటూ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించారని మంత్రి వెల్లంపల్లి గుర్తు చేశారు. ఇప్పుడు డిప్యూటీ ఛైర్మన్‌ కూడా ఇది రాజ్యాంగబద్ధమైన సీటు అని చెబుతూనే.. చేసిన పనులు, మాట్లాడిన తీరు సరికాదని మంత్రి వెల్లంపల్లి అన్నారు. డిప్యూటీ ఛైర్మన్‌ సీట్‌లో కూర్చొని.. ప్రభుత్వం నాకు ఎస్కార్ట్, గన్‌మెన్‌, ప్రొటోకాల్ తీసేశారని చీప్‌గా మాట్లాడటం అనేది ఆయన వ్యక్తిత్వ తీరుకు అద్దం పడుతోందన్నారు. మళ్లీ, మావాళ్లకు కూడా చెప్పానని డిప్యూటీ ఛైర్మన్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ కలగజేసుకొని మావాళ్లు అంటే ఎవరని ప్రశ్నిస్తే డిప్యూటీ ఛైర్మన్ తడబడ్డారన్నారు. గతంలో అనేక మంది ఆ సీటులో కూర్చున్నారు. ఎవ్వరూ కూడా ఇలా వ్యవహరించిన పరిస్థితి లేదని వెల్లంపల్లి తెలిపారు. కాగా, స‌ర్కారు ఎదురుదాడితో మండ‌లి వివాదం లోకేష్ మెడ‌కు చుట్టుకుంటోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: