టీవీ5 మూర్తి.. మహా మూర్తి.. ఏబీఎన్‌ మూర్తి.. ఇలా కాస్త పేర్లు అటూ ఇటూ మారినా అన్నింటా ఉన్నది ఆ మూర్తే.. ప్రస్తుతం టీవీ5లో పని చేస్తున్నాడు కాబట్టి ఆయన టీవీ5 మూర్తి అయ్యాడు. ఈ జర్నలిస్టును అరెస్టు చేసేందుకు ఏపీ సర్కారు ప్రయత్నిస్తోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తరవాత ప్రభుత్వానికి చెందిన ఓ రహస్య డాక్యుమెంట్‌ను అక్రమ మార్గంలో పొందారన్న విషయంలో ఆయనపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు పెట్టారు.

 

 

ఈ కేసు కారణంగా ఆయన ఇటీవల తరచుగా టీవీ5 లో తాను నిర్వహించే డిబేట్లకు హాజరుకావడం లేదు. ఇప్పుడు తాజాగా ఆయన వీడియో సందేశంతో కలకలం సృష్టిస్తున్నారు. తనను ఏపీ సీఐడీ పోలీసులు వేధిస్తున్నారని.. ఇలా తనను వేధించడం కంటే .. తన ఊపిరి తీయడం మేలు అంటూ తన ఫేస్ బుక్ వాల్ పై ఆ వీడియోను పోస్టు చేశారు. ఆయన వాదన ఏంటంటే.. విశ్వవిద్యాలయాల్లో పాలక మండలి నియామకాల్లో రాజకీయ జోక్యం ఉందంటూ ఇటీవల తనను ఒకరు చెప్పడంతో ఆయనతో డిబేట్ నిర్వహించానని తెలిపారు.

 

 

అయితే ఆ డాక్యుమెంట్ ను ఆయన ఎలా సంపాదించారో తనకు తెలియదని.. తనకు సంబంధం లేదని.. దాన్ని తాము టెలికాస్ట్ చేయడంతో ఏపీ సర్కారు సదరు వ్యక్తిని ఏవన్ గానూ.. తనను ఏటూ గానూ.. తమ ఛైర్మన్ ను ఏ త్రీ గానూ పోలీసులు కేసు పెట్టారని మూర్తి వివరించారు. తమను అరెస్టు చేసే అవకాశం ఉండటంతో తాము ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును అడిగామని.. తమ వాదనతో ఏకీభవించి ముందస్తు బెయిల్ కూడా ఇచ్చిందని మూర్తి వివరించారు.

 

అయితే విచారణ పేరిట తమను సీఐడీ పోలీసులు పదే పదే తమ కార్యాలయానికి పిలిపిస్తూ.. గంటల తరబడి వెయిట్ చేయిస్తున్నారని.. తమను మానసికంగా వేధించడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందని మూర్తి ఆరోపించారు. తనకు జర్నలిజమే ఊపిరి అంటున్న మూర్తి ఇలా పదే పదే పదే విచారణకు పిలిపించడం ద్వారా తనను అడ్డుకోలేరని అంటున్నారు. అంతగా తనను ఆపారంటే తన ఊపిరి తీయాలని మూర్తి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: