అమరవీరుడు కల్నల్‌ సంతోష్‌బాబుకు ఘనంగా వీడ్కోలు పలికారు. కేసారం వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వీర జవాన్‌ కుటుంబ సభ్యులు, సైనికులు, రాజకీయ నేతలు సంతోష్‌బాబుకు అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. అంతకుముందు...సూర్యాపేట వీధుల గుండా మూడు గంటల పాటు సాగిన అంతిమయాత్రలో పట్టణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 


 
భారత్‌-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. సూర్యాపేట సమీపంలోని కేసారంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. సైనిక సంస్కారాల ప్రక్రియలో 16 బిహార్‌ రెజిమెంట్‌ బృందం పాల్గొంది. కరోనా వల్ల పరిమిత సంఖ్యలో అంత్యక్రియలకు అనుమతించారు అధికారులు.

 

అంతకుముందు...విద్యానగర్‌లోని సంతోష్‌బాబు స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర ఎంజీ రోడ్డు, శంకర్‌ విలాస్‌ సెంటర్‌, రైతు బజార్‌, పాత బస్టాండ్‌, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు కొనసాగింది. సంతోష్‌ బాబును కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

 

సంతోష్ బాబు .. అమర్‌ రహే, వందే మాతరం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ ప్రజలు భవనాలపై నుంచి పూలు చల్లుతూ నివాళులర్పించారు. స్థానికులు జాతీయ జెండాలు చేతబూని సంఘీభావం ప్రకటించారు. సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు.

 

మొత్తానికి కల్నల్ సంతోష్ బాబు మరణం యావత్ దేశాన్ని కదిల్చివేసింది. అంత్యక్రియల సమయంలో సంతోష్ బాబు సతీమణికి సైనికులు అందించిన దుస్తులను చూసి సగటు ప్రేక్షకుడు కన్నీటి పర్యంతమయ్యాడు. హుందాతనాన్ని చాటే నిండైన దుస్తులతో కనిపించిన వ్యక్తి.. కేవలం దుస్తుల రూపంలో ఆమె చేతికి అందడాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సంతోష్ బాబు నాలుగేళ్ల అబ్బాయిని చూసిన వారికి కళ్లు చెమర్చాయి. ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి.. అందరూ సెల్యూట్ చేస్తుంటే.. తాను కూడా తండ్రి భౌతిక కాయానికి సెల్యూట్ చేశాడు.    

 

మరింత సమాచారం తెలుసుకోండి: