ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు జగన్నాథ రథ చక్రాలు సైతం ఈ ఏడాది ఆగిపోయాయి. ఏటా పూరీలో ఏనిమిదిరోజుల పాటు జరిగే వేడుకను నిర్వహించవద్దని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది . మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో యాత్ర చేస్తే.. సుభద్ర బలభద్రల సమేతంగా పయనమయ్యే జగన్నాథుడు సైతం క్షమించడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం విశేషం.

 

పూరీలో ఈ ఏడాది జగన్నాధుడి రథ చక్రాలు కదలడం లేదు. రథయాత్రపై సందిగ్ధతను తొలగించింది సుప్రీంకోర్టు. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో.. యాత్ర నిర్వహణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ రథయాత్ర నిర్వహిస్తే ఆ దేవుడే మనల్ని క్షమించడంటూ వ్యాఖ్యానించింది ధర్మాసనం. 

 

భారతీయ వికాస్‌ పరిషత్‌ దాఖలు చేసిన స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టింది సర్వోన్నత న్యాయస్థానం. భౌతిక దూరం నిబంధనకు ప్రాధాన్యం కల్పించేందుకు యాత్ర నిర్వహణలో.. యాంత్రిక శక్తి, ఏనుగుల వినియోగం పట్ల హైకోర్టు మొగ్గు చూపడం.. ఆలయ సంప్రదాయ, చట్టాలకు వ్యతిరేకమని సుప్రీం కోర్టుకు వివరించింది భారతీయ వికాస్ పరిషత్.

 

పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పూరీజగన్నాథ రథయాత్రపై స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. కాగా, విపత్కర పరిస్థితుల్లో జగన్నాథుని రథయాత్ర పలుమార్లు నిలిపి వేసినట్లు చారిత్రక దాఖలాలు ఉన్నాయి. గడిచిన 452 ఏళ్లలో 32 సార్లు వాయిదా పడినట్లు పిటిషినర్‌ సంస్థ అధ్యక్షుడు సరేంద్ర పాణిగ్రహి తెలిపారు. 

 

పూరీ రథయాత్రకి విశిష్టమైన చరిత్ర ఉంది. చంద్రమానం ప్రకారం... ఏటా ఆషాఢంలో వచ్చే శుక్లపక్షం రెండో రోజున ఈ వేడుక జరుగుతుంది. సుభద్ర బలభద్రుల సమేతంగా జగన్నాథుడు మేనత్త ఇంటికి వెళ్లివస్తాడనేది భక్తుల విశ్వాసం. అయితే, రథయాత్ర జరిగితే కరోనా మరింతగా విస్తరించే అవకాశం ఉండటంతో.. భక్తులు లేకుండా రథయాత్ర నిర్వహించాలని భావిస్తోంది... పూరి జగన్నాథ్ ఆలయ ట్రస్ట్. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జూన్ 30 వరకు ఒడిశాలో మతపరమైన ఉత్సవాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: