గత సంవత్సరాలతో పోలిస్తే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఈ సంవత్సరం దిగుబడులు పెరిగాయి. అధిక వర్షపాతం నమోదు కావడం వల్లే పంటలు సమృద్ధిగా పండాయి. అయితే దిగుబడులు పెరిగినా రైతు కష్టాలు మాత్రం తీరడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా వాటి వల్ల రైతులకు చేకూరుతున్న ప్రయోజనం తక్కువే. ప్రభుత్వాలు చెబుతున్న మాటలు చేతల్లో అమలు కావడం లేదు. 
 
చివరకు అధికారులు కూడా రైతులను మోసం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇలా జరుగుతున్న మోసాల గురించి ఒక రైతు తెలంగాణ హైకోర్టుకు లేఖ రాశారు. రైతు లేఖలో తన పేరు గొంటి మురళి అని... తనది జగిత్యాల మండలం సామన్ పల్లి అని మా రైతు సోదరులందరి తరపున ఈ లేఖను నేను రాస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటివరకూ రైతులు ఎన్ని ధర్నాలు చేసినా... ఎన్ని నిరసనలు చేసినా ఫలితం మాత్రం శూన్యంగానే కనిపించిందన్నారు. 
 
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుంటోందని... ప్రభుత్వం, మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట క్వింటాళుకు 5 కిలోల ధాన్యాన్ని ఎక్కువగా తూకం వేయించుకున్నారని... జగిత్యాల జిల్లాలో జరిగిన ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని... కొనుగోలు కేంద్రంలో తూకం అయిన లారీని వే బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి.. తాము వెయిట్ చెక్ చేయించగా తక్కువ ధాన్యం ఉన్నట్టుగా తక్ పట్టీలో రాసిచ్చిన విషయం తేటతెల్లం అయిందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా మోసాలు జరుగుతున్నాయని... మిల్లర్లు వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడుతున్నారని పేర్కొన్నాడు. మిల్లర్లు, అధికారులు కలిసి మోసం చేస్తుండటం వల్ల నష్టపోతున్నామని.... తమను మోసం చేసిన నగదు వెంటనే ఖాతాలలో జమయ్యేలా చేయాలని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి మోసాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెడితే బాగుంటుందని... ఆ రైతు ఆవేదనను అర్థం చేసుకోవాలనే ప్రజల నుంచి విజ్ఞప్తులు వ్యక్తమవుతున్నాయి 

మరింత సమాచారం తెలుసుకోండి: