ప్రతి మనిషి అవతలి వ్యక్తులకు నచ్చాలని లేదు. దేశంలోని రాజకీయ నాయకులలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తూ.... కొన్ని సిద్ధాంతాలను అనుసరిస్తూ ఉంటారు. మన ఆలోచనలకు అనుగుణంగా ఉన్న వ్యక్తులు మనకు నచ్చుతారు. మన ఆలోచనలకు విరుద్ధంగా ఉండే వ్యక్తులు నచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. భారతదేశం భావ ప్రకటన హక్కు ద్వారా మన భావాలను బయటకు చెప్పే అవకాశం కల్పించింది. 
 
అయితే ఈ భావ ప్రకటన హక్కును ప్రజలు అర్థం చేసుకునే విధానం వింతగా ఉంది. కొందరు ప్రజలు తమ భావాలను స్వచ్చందంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తున్నారు. అయితే వారిని ఎవరైనా విమర్శిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయనాయకులపై ద్వేషాన్ని దేశంపై చూపిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని పార్టీల మధ్య సిద్ధాంతపరంగా ఉన్న బేధాల వల్ల కొందరు ప్రజల్లో నాయకులపై వ్యతిరేకత దేశంపై వ్యతిరేకతను పెంచుతోంది. 
 
సోమవారం రోజున జరిగిన ఘటన వల్ల భారత్ చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల అనంతరం మోదీపై వ్యతిరేకత ఉన్నవాళ్లు దేశాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. రాజకీయ నాయకులపై ద్వేషాన్ని దేశంపై చూపిస్తున్నారు. ఈ విధంగా దేశంపై కామెంట్లు చేయడం మన దేశాన్ని అగౌరవపరచడమే. 
 
దేశంకోసం నిత్యం వేలాది మంది సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. దేశం కోసం జరిగే యుద్ధాలలో ప్రాణాలు కోల్పోతూ వీరమరణం పొందుతున్నారు. సోషల్ మీడియాలో దేశంపై వ్యతిరేకంగా కామెంట్లు మాటల యుద్ధాలు చేసే వాళ్లకు సైనికుల కష్టం ఎప్పటికీ అర్థం కాదు. దేశంపై ద్వేషం ప్రదర్శిస్తున్న వాళ్లు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే వాళ్లు చేస్తున్న తప్పేంటో వాళ్లకే అర్థమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.                   
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: