శాసనమండలి అంటే పెద్దల సభ కాదు పెద్దగా పెద్దగా తిట్టుకుంటూ, కొట్టుకునే సభ అని తాజా ఘటనలు రుజువు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు కేవలం మాటల యుద్ధానికే పరిమితం కాకుండా...ఒకరిపై ఒకరు దాడి చేసుకుని మండలి ప్రతిష్టని మంట కలిపేశారు. అయితే దీనికి ఎవరు అతీతంగా లేరు. రెండు పార్టీల నేతలు దారుణంగా తిట్టుకుని, కొట్టుకుని మండలిలో కొత్త చరిత్ర సృష్టించారు.

 

ఇక ఎవరు ఎవరిని కొట్టుకున్నారు, ఎవరు ఎవరిని తిట్టారు అనే విషయాల్లో రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మండలిలో ప్రజలకు ఉపయోగపడే బిల్లులను టీడీపీ అడ్డుకుందని, సభా సంప్రదాయాన్ని ఉల్లంఘించిందన్నారు. సభలో లోకేష్ ఫొటోలు తీయడం, యనమల డిప్యూటీ ఛైర్మన్‌కు స్లిప్పులు పంపడం నిబంధనల ఉల్లంఘనేనన్నారు. మంత్రి వెల్లంపల్లిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

అయితే మండలిలో ఏం జరిగిందో పూర్తి వీడియో వస్తేనే ప్రజలకు అర్ధమవుతుంది. కానీ ఇక్కడ శ్రీకాంత్ చెప్పే మాటలు మొత్తం రివర్స్‌లో ఉన్నాయని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. మండలిలో వేరేగా జరిగితే ఈయన వారికి అనుకూలంగా చెబుతున్నారని మండిపడుతున్నారు. సరే టీడీపీ నేతలు మండలిలో అలాగే ప్రవర్తిస్తే...అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

 

అసెంబ్లీని వారికి నచ్చినట్లే నడుపుకుంటున్నారని, శ్రీకాంత్ రెడ్డి ఎన్నిసార్లు స్పీకర్ తమ్మినేని సీతారాం దగ్గరకు వెళ్ళి స్లిప్స్ ఇచ్చారో తెలియదా? ఆయన చెవి దగ్గరకు వెళ్ళి ఎన్నిసార్లు గుసగుసలాడారో తెలియదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకా మండలి లైవ్ ఆపేయడం వల్లే, లోకేష్ ఫోటోలు తీయడానికి ప్రయత్నించారని చెబుతున్నారు. అలాగే సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులని మళ్ళీ తెచ్చి ప్రజలకు ఉపయోగ పడే బిల్లులని అడ్డుకున్నారని మాట్లాడటం సరికాదని, అసలు టీడీపీ ముందుగా బడ్జెట్ బిల్లుని ఆమోదించమంటేనే వైసీపీ మూడు రాజధానుల బిల్లు కోసం పట్టుబట్టి రచ్చ చేసిందని తమ్ముళ్ళు ఆవేశంగా మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: