శాసనమండలిలో జరిగిన దాడిపై అధికార ప్రతిపక్షాలు ఎదురుదాడి చేసుకుంటున్నాయి. బడ్జెట్ ఆమోదం నుంచి..  వ్యక్తిగత దాడులకు దారితీసిన పరిస్థితుల వరకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాను అసభ్యంగా ప్రవర్తించి ఉంటే నిరూపించాలని మంత్రి అనిల్ సవాల్ చేయగా.... సభలో వీడియోలు బయటపెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వానికి బడ్జెట్ కంటే రాజధాని బిల్లులే ముఖ్యమా అంటూ ప్రశ్నిస్తోంది. 

 

శాసనమండలిలో బుధవారం జరిగిన గొడవపై రాజకీయ రగడ మరింత పెరిగింది. ఇప్పటికే మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్సీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. సభలో గతంలో లేని పరిస్థితికి కారణం మీరంటే మీరంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. తన 38ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ రూల్ బుక్ మీరలేదని యనమల చెప్పగా.... కావాలనే యనమల కుట్రతో సభ పక్కదారి పట్టిందని మంత్రి అనిల్ ఆరోపించారు.

 

సభలో మంత్రి - ఎమ్మెల్సీ మధ్య దాడి విషయంలోనూ ప్రత్యర్థి వర్గాలదే తప్పు అంటూ నేతలు చెప్పుకొచ్చారు. తమ పట్ల టీడీపీ నేతలు రౌడీల్లా ప్రవర్తించారని మంత్రి వెల్లంపల్లి మండిపడితే... అసలు.. మంత్రి వెల్లంపల్లి టిడిపి సభ్యుల వైపు ఎందుకు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సభలో నిన్న సెషన్ కు సంబంధించి మొత్తం వీడియోలు బయట పెట్టాలని అంటున్నారు. సభలో మంత్రుల భాష తీవ్ర అభ్యతరకంగా ఉందని ఎమ్మెల్సీలు ఆరోపించారు. 

 

ప్రభుత్వ బిజినెస్‌ను అడ్డుకోవాలని ప్రతిపక్షం పక్కా ప్రణాళికతో వచ్చిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. సంఖ్యాబలం ఉందని టీడీపీ ఎమ్మెల్సీలు మండలిలో తమ ఇష్టారీతిన ప్రవర్తించారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అయితే తాము బిల్లులను అడ్డుకోలేదని, ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టాలని పదే పదే కోరామని టీడీపీ చెబుతోంది. 

 

సభలో జిప్ తీశారు అంటూ మంత్రి అనిల్‌పై టీడీపీ ఆరోపణలు చేసింది. అయితే దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. తనపై ఆరోపణలకు సాక్ష్యాలు చూపాలని, లేదంటే, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తారా అని సవాల్ విసిరారు. 

 

మొత్తానికి రెండు పార్టీలు మండలిలో జరిగిన వాగ్యుద్ధాన్ని ఇంకా బయట కూడా కొనసాగిస్తున్నాయి. పరస్పరం ఆరోపణలతో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. సభలో దాడిపై ఒకరిపై ఒకరు ఎదురుదాడి చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: