ఏపీలో రేపటి రాజ్యసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నాలుగు స్థానాలకు... ఐదుగురు అభ్యర్ధులు బరిలో నిలిచారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ, టీడీపీకి ఉన్న శాసనసభ్యుల బలాబలాలు చూస్తే ఎన్నిక నామమాత్రమే అంటున్నాయ్ రాజకీయ వర్గాలు.  

 

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలకు కసరత్తు పూర్తయ్యింది. శాసనసభ ప్రాంగణంలో పోలింగ్‌ నిర్వహణకు అసెంబ్లీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. ఐదు గంటలకు కౌంటింగ్‌ ప్రారంభిస్తారు. ఆరు గంటలకు రిటర్నింగ్‌ అధికారి ఫలితాలను వెల్లడిస్తారు. కోవిడ్‌ పరిస్థితులతో ఫిజికల్‌ డిస్టెన్సింగ్‌, శానిటైజేషన్‌ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


 
ఏపీ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వైసీపీ నుంచి నలుగురు అభ్యర్ధులు బరిలో నిలిచారు.. మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణతో పాటు పారిశ్రామిక వేత్త అయోధ్య రామిరెడ్డి.. గుజరాజ్‌కు చెందిన అంబానీ సన్నిహితుడు పరిమళ్‌ నత్వాని బరిలో ఉన్నారు. వర్ల రామయ్యను పోటీలో నిలబెట్టింది టీడీపీ. ఐతే తగిన బలం లేకపోయినా టీడీపీ అభ్యర్ధిని బరిలో నిలబెట్టడంతో ఎన్నిక అనివార్యం అయ్యింది.

 

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి తమ పార్టీ శాసన సభ్యులకు శాసనసభ ప్రాంగణంలో మాక్ పోలింగ్‌ నిర్వహించారు. రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, అభ్యర్ధులు కూడా ఈ మాక్‌ పోలింగ్‌లో పాల్గొన్నారు. ఒక్కో రాజ్యసభ సీటు గెలుపునకు 34 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. వైసీపీ ఒక్కో రాజ్యసభ అభ్యర్ధికి 36 మంది ఎమ్మెల్యేలను కేటాయించిందని సమాచారం. అంటే 144 మంది ఎమ్మెల్యేల బలంతో తేలిగ్గా నాలుగు రాజ్యసభ స్థానాలను అధికార పక్షం కైవసం చేసుకుంటుంది. వైసీపీకి మొత్తం 151 శాసనసభ్యుల బలం ఉంది. ఇటు టీడీపీకి ఉన్న శాసనసభ్యుల బలం 23 మాత్రమే. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీతో టచ్‌లో ఉన్నారు. ఈ లెక్కన టీడీపీకి గెలిచే అవకాశాలు దాదాపు లేనట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: