ఈ మధ్యకాలంలో మనుషులు క్షణికావేశంలో ఏం చేస్తున్నారో  అర్థం కాని పరిస్థితి. క్షణికావేశంలో ప్రవర్తిస్తున్న తీరును చూసి ఏకంగా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు  ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఓ వ్యక్తి భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ఫోన్ చేశాడు.  ఎంతకీ భార్య  ఫోన్ ఎత్తలేదు. దీంతో కోపంతో ఊగిపోయాడు ఆ వ్యక్తి. అత్త వల్లే  తన భార్య ఇలా చేస్తుందని భావించి అత్తారింటికి వెళ్లి అత్తను తిట్టడం ప్రారంభించాడు.  భార్య అడ్డు వస్తుందని మరింత కోపోద్రిక్తుడై అత్తను  కాల్చేశాడు అల్లుడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

 

 గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో చోటు చేసుకుంది ఈ వింత ఘటన. నగరంలో మణిపూర్ ఏరియాకు చెందిన ఆశిష్ దేశాయ్  అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన వర్ష ని పెళ్లి చేసుకున్నాడు.  కొన్ని రోజుల వరకు దాంపత్యజీవితం హాయిగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇక వారిద్దరి దాంపత్య జీవితంలో అత్త పెత్తనం ఎక్కువైపోయింది అని అల్లుడు ఎప్పుడూ కోప్పడే వాడు. ఈ క్రమంలోనే ఓ రోజు భర్త భార్యతో గొడవపడి పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత భార్య పుట్టినరోజు ఉందని భార్యకు బర్త్ డే విషెస్ చెప్పడానికి కాల్ చేశాడు భర్త. ఎంత  చేసిన భార్య మాత్రం ఫోన్ ఎత్తలేదు. 

 


 దీంతో తన అత్త కారణంగానే భార్య ఫోన్ ఎత్తడం లేదని భావించి నేరుగా అత్తారింటికి వెళ్లాడు. ఇక అక్కడ అత్త ను దారుణంగా తిట్టడం మొదలు పెట్టాడు ఆశిష్. మా అమ్మను తిట్టవద్దు  అంటూ తన భార్య అడ్డువచ్చింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన ఆశిష్ తన వెంట తెచ్చుకున్న రివాల్వర్ తో ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే బుల్లెట్ ఏకంగా అత్త భుజం లోకి దూసుకెళ్లింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక కాల్పులు జరిపిన నిందితుని పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: