ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. అమాయకులైన అబ్బాయిలనే ఏరగా చూస్కొని కొంతమంది ఫ్రాడ్ లేడీస్ రెచ్చిపోతున్నారు. మత్తుగా మాటలు కలిపి బాంక్ ఖాతాలో సొమ్ములు స్వాహా చేసేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది.


ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన కిషోర్‌ ప్రస్తుతం ఎస్సార్‌నగర్‌లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. అతడి తండ్రి స్వస్థలంలోనే ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం పదవీ విమరణ చేసిన ఆయనకు రూ.15 లక్షలు బెనిఫిట్స్‌ అందాయి. వీటిని స్థానిక ఎస్బీఐ బ్రాంచ్‌లో కుమారుడు కిషోర్‌ పేరుతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాడు. ఈ ఖాతాకు సంబంధించిన యూనో యాప్‌ను కిషోర్‌ తన స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని లావాదేవీలు జరిపేవాడు. 


 ఆ యువకుడికి ఈ మధ్య కాలంలో డేటింగ్ యాప్ లో అఖిల అని చెప్పుకున్న యువతి పరిచయం అయింది. వాట్సాప్, ఐఎంఒ యాప్స్‌ ద్వారా చాటింగ్, ఫోన్‌ కాల్స్‌ వీరిద్దరి మధ్యా సాగాయి. కిషోర్‌ దగ్గర ఉన్న మొత్తం కొల్లగొట్టాలనే పథకం పన్నిన అఖిల అదును చూసుకుని అతడితో ఫోన్‌లో ‘గూగుల్‌ ప్లే సర్వీసెస్‌’  యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించింది. దానిని యాక్సస్‌ చేయడానికి అనువైన నంబర్‌ను అతడి నుంచే తీసుకుని తన ఫోన్‌ ద్వారా లింకు ఏర్పాటు చేసుకుంది. టీమ్‌ వ్యూవర్‌ తరహాకు చెందిన ఆ యాప్‌ ద్వారా అఖిల తన ఫోన్‌ నుంచే కిఫోర్‌ ఫోన్‌ను, అందులోని యాప్స్‌ను యాక్సస్‌ చేయవచ్చు.

 

కొన్ని రోజుల తర్వాత తనకు కొంత డబ్బు అవసరం ఉందని, కావాల్సినప్పుడు అడిగితే సహాయం చేయాలని కోరడంతో కిషోర్‌ అందుకు అంగీకరించాడు. ఈ నెపంతో తనను యూనో యాప్‌లో బెనిఫిషియరీగా జోడించేలా చేసింది. ఎప్పటి లాగానే వీరిద్దరూ బుధవారం ఉదయం చాలాసేపు చాటింగ్‌ చేసుకున్నారు.

 

బుధవారం మధ్యాహ్నం అతడి ప్రమేయం లేకుండానే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది,ఆన్‌ చేశాక యాప్స్‌ అన్నీ డిలీట్‌ అయి ఉండటంతో అనుమానం వచ్చి ఏపీలో ఉన్న బ్యాంకు ఖాతా సరిచూడగా... అందులో ఉండాల్సిన రూ.15 లక్షలకు బదులు రూ.3.7 లక్షలు మాత్రమే ఉన్నాయి. వెంటనే లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: