కొన్ని సార్లు మనకు తెలియకుండా చేసే తప్పులు ఇతరులు వేలెత్తి చూపిస్తే ఛ ఇంత దారుణంగా ఎలా తప్పు చేశానబ్బా అనుకుంటారు. మరికొంత మంది అయితే దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం చైనా- భారత్ మద్య యుద్ద మేఘాలు అల్లుకున్నాయి.  డ్రాగన్ కుట్ర చేసి దొంగ దెబ్బ తీసి మన 20 మంది సైనికులను పొట్టన బెట్టుకుంది. దాంతో చైనాపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు వ్యవహరించారు పశ్చిమ బెంగాల్ బీజేపీ కార్యకర్తలు. చైనాపై ఉన్న కోపాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పై చూపారు. ఇటీవల లద్ధాఖ్ లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్‌లోని అసాంసోల్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.

పలు ప్రాంతాల్లో జనం రోడ్లపైకి వచ్చి చైనాకు వ్యతిరేకంగా జెండాలు, దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు చైనా వ్యతిరేక నిరసనలు అసాంసోల్‌లో చేపట్టారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మకు బదులుగా పొరపాటున ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దిష్టిబొమ్మను వారు తగులబెట్టారు.  అయితే ఇది  ఉద్దేశపూర్వకంగా కాకపోయినా జరిగిన పొరపాటుకు సంబంధించిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

గత కొంత కాలంగా కిమ్ జోంగ్ పేరు బాగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్దేశంతోనే వారంతా కన్ప్యూజ్ అయ్యారని తెలుస్తుంది.  నిరసనకారుల ఆగ్రహం గురితప్పిందని కొందరు నెటిజన్లు స్పందిస్తే,  లైట్‌గా తీసుకోండంటూ మరికొందరు స్పందించారు. అయితే,  'కరోనా వైరస్ గో' అంటూ నిరసనల్లో పాల్గొన్న మహిళ ఒకరు కుండపై దరువు వేస్తూ నినాదాలు చేయడం అసలు ఘటన కంటే 100 శాతం నవ్వు పుట్టిస్తోందంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: