అనుకున్నట్టుగానే రాజ్యసభ ఎన్నికల హడావుడి సక్సెస్ ఫుల్ గా ముగిసింది. అధికార పార్టీ వైసీపీ ముందు నుంచి భావిస్తున్నట్టుగానే నాలుగు స్థానాలను దక్కించుకుంది. ఆ నాలుగు స్థానాల్లో ఇద్దరు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. వారే మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈ ఇద్దరు జగన్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డారు. మొదటి నుంచి తనని నమ్ముకుని ఉన్న వారు కావడంతో జగన్ వీరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. వీరు కాకుండా రాజ్యసభకు ఎంపికైన మరో ఇద్దరు అయోధ్య రామిరెడ్డి , పరిమల్ నత్వాని.ఈ  ఇద్దరిలో అయోధ్యరామిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు కాగా, నత్వాని అంబానీ సిఫార్సు తో వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇది ఇలా ఉంటే  పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ స్థానంలో ఆ రెండు మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే విషయంపై ఇప్పుడు వైసీపీ లో ఎక్కువ చర్చ నడుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ కొత్త మంత్రులు ఎంపికపై పూర్తిస్థాయిలో కసరత్తు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. 


కాకపోతే ఈ విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా, ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. వైసీపీ కీలక నాయకులు అంచనా ప్రకారం మోపిదేవి వెంకటరమణ, సుభాష్ చంద్రబోస్ సామాజిక వర్గాలకు చెందిన వారిని జగన్ ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అలా కాని పక్షంలో, అదే జిల్లాలకు చెందిన వారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఎవరికి వారు జగన్ దృష్టిలో పడేందుకు మంత్రి పదవులు సంపాదించేందుకు, వై వి. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ముగ్గురు వద్దకు ఆశావహులు క్యూ కడుతున్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది.


 మరి జగన్ మనసులో ఎవరున్నారు అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. టిడిపి నాయకులు విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తూ పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించే వారికి అవకాశం ఉంటుంది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఈ రెండు మంత్రి పదవుల తో పాటు క్యాబినెట్ ప్రక్షాళన చేస్తారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నా జగన్ మాత్రం ఈ విషయంలో ఎటువంటి సమాచారం బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: