తెలంగాణ సీఎం కేసీఆర్ భారత్-చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఘర్షణల విషయంలో ఏ మాత్రం తొందరపాటుగా వ్యవహరించవద్దని మోదీకి సూచించారు. దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని... కేంద్రానికి తమ మద్ధతు పూర్తిగా ఉంటుందని ఆయన తెలిపారు. 
 
దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదని... యుద్ధనీతి అని ఆయన అన్నారు. దేశంలో పరిపాలన సుస్థిరంగా ఉండడంతో పాటు, గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని సీఎం అభిప్రాయపడ్డారు. గాల్వన్ లోయలో వీరమరణం పొందిన సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే సాయాన్ని సీఎం అఖిలపక్ష సమావేశంలో ప్రకటించారు. 
 
భారత్ తో చైనా మొదటి నుంచి ఘర్షణ వైఖరి అవలంభిస్తోందని... చైనాతో భారతదేశానికి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందని.... మనం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉందని సీఎం అన్నారు. మరోవైపు గాల్వన్ లోయలో డ్రాగన్ సైనికుల దాడి అనంతరం చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దేశంలో చైనీస్ వస్తువులపై నిరసన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం దశల వారీగా చైనా వస్తువులను నిషేధించాలని ప్లాన్ చేస్తోంది. 
 
మనం ముందుగా మన దేశంలో తయారయ్యే వస్తువులను ఇక్కడే వినియోగిస్తే విదేశీ వస్తువులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అప్పుడు చైనా వస్తువులపై నిషేధం సాధ్యమవుతుంది. ఇప్పటికే పలువురు వ్యాపారులు చైనా వస్తువులను అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కూడా చైనా వస్తువులను వినియోగించడం తగ్గిస్తే మాత్రం చైనా వస్తువుల బహిష్కరణ సులభంగా సాధ్యమవుతుంది. చైనీస్ యాప్స్ ను వినియోగించే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. ఆ యాప్స్ వల్ల చైనా వ్యక్తిగత వివరాలను సేకరిస్తోందని... ఆ వివరాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: