తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన మాట నిజ‌మైంది. ఆర్టీసీ స‌మ్మె స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి చెప్పిన మాట‌ను ఆ సంస్థ ఉన్న‌తాధికారులు అమ‌లు చేశారు. ఆర్టీసీకి అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకే పీసీసీ (పార్సిల్‌, కొరియర్‌, కార్గో) సేవలను విస్తృతం చేయాల‌ని ఆదేశించారు. తాజాగా ఇదే అమ‌ల్లోకి వ‌చ్చింది. ర‌వాణాశాఖ  కార్యాలయంలో ఆర్టీసీ పార్సిల్స్‌, కొరియర్‌, కార్గో సేవలను ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, పీసీసీ ప్రత్యేక అధికారి ఎస్‌ కృష్ణకాంత్‌తో కలిసి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉన్నందున ఈ-కామర్స్‌ సంస్థలకు మరింత నమ్మకంగా సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

 


ఆర్టీసీకి అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకే పీసీసీ (పార్సిల్‌, కొరియర్‌, కార్గో) సేవలను విస్తృతం చేస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వివరించారు. వినియోగదారులు చిన్నపాటి కవర్లతోపాటు పార్సిల్స్‌, కొరియర్‌ సేవలను సులభంగా బుక్‌ చేసుకునేందుకు వీలుగా మొబైల్‌ అప్లికేషన్‌ను సైతం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. చార్జీల వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే ఆర్టీసీ ఆర్థికంగా బలపడేందుకు ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్‌ తర్వాత ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆదాయం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్సిల్‌, కొరియర్‌, కార్గో సేవలు ఉపకరిస్తాయని పువ్వాడ అజ‌య్ కుమార్‌ తెలిపారు. అన్ని బస్ స్టేషన్లలో సంస్థ ఉద్యోగులతో ఈ పీసీసీ సెంటర్లు నిర్వహిస్తున్నామని, తొలిదశలో 104 కార్గో బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయని, 140 బస్ స్టేషన్లలో పార్సిల్‌ సేవలు అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేటు కంపెనీలకు సేవలను విస్తరిస్తామని చెప్పారు. కాగా, ఆర్టీసీ ఆర్థిక క‌ష్టాల‌కు ఈ కొత్త సేవ‌లు చెక్ పెట్ట‌నున్నాయని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: