దేశంలో కరోనా ఎప్పటి నుంచి మొదలైందో అప్పటి నుంచి వరుసగా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి.  తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 499 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 6,526కి చేరింది. ఇందులో 2,976 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,352 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 198 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  ఇక గత మూడు నెలల క్రితం కరోనా వైరస్ దేశంలో మొదలైన తర్వాత మార్చిలో లాక్ డౌన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆదాయవనరులు లేకపోవడంతో ఇంటి అద్దె వసూళ్లు చేయొద్దని ప్రభుత్వం సూచింది. కానీ ఇంటి అద్దెలు వసూళ్లు చేసినట్లు ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 

 

ఇలాంటి కష్టకాలంలో తన భార్య పుట్టిన రోజు కానుకగా ఆమె ఆనందం కోసం 14 దుకాణాల నుంచి రావాల్సిన లక్ష రూపాయల అద్దె రద్దు చేశారు ఓ యజమాని. చెన్నై మాధవరం నెహ్రూ వీధికి చెందిన ఏలుమలై (58) తన కట్టడంలోని 14 గదులను దుకాణాలకు అద్దెకిచ్చాడు. వాటిలో ఫొటో స్టూడియో, సెలూన్, జిరాక్స్ వంటి దుకాణాలున్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇవన్నీ గత రెండు నెలలుగా మూతబడ్డాయి. గత రెండు నెలల నుంచి  ఎలాంటి ఆదాయం లేకుండా చాలా ఇబ్బందులు పడ్డారు.

 

వారి కష్టాలు దృష్టిలో పెట్టుకొని తన భార్య పరమేశ్వరి (49) పుట్టిన రోజును పురస్కరించుకుని 14 దుకాణాల ఒక నెల అద్దెను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ దుకాణాల నుంచి తనకు నెలకు దాదాపు లక్ష రూపాయలు వస్తుందని ఏలుమలై పేర్కొన్నాడు.  లాక్‌డౌన్ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న దుకాణదారులను కొంతైనా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఏలుమలై నిర్ణయంతో దుకాణదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: