రేపు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరించనుంది. సూర్యుడు మండుతున్న ఉంగరంలా వినువీధిన దర్శనమివ్వనున్నాడు. వలయాకార గ్రహణం ఏర్పడనుంది.  ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రణం కావడం, అదీ కరోనా విలయంలో వస్తుండటంతో.. అందరిలో ఆసక్తి నెలకొంది. సూర్య గ్రహణం ఎఫెక్ట్‌తో ఈ రోజు రాత్రి నుంచి ఆలయాలను మూసివేయనున్నారు.

 

రేపు ఈ ఏడాది అతిపెద్ద రాహుగ్రస్త సూర్యగ్రహణం రాబోతోంది.  ఉదయం 10 గంటల 18 నిమిషాలకు గ్రహణం మొదలై  మధ్యాహ్నం ఒక గంట 49 నిమిషాలకు  ముగియనుంది.  డిసెంబర్ 26, 2019లో వచ్చిన సూర్యగ్రహణానికీ, రేపటి రాహుగ్రస్త గ్రహణానికి చాలా తేడా ఉంటుంది.  ఈ ఏడాదికి ఇదే తొలి సూర్యగ్రహణం కావడంతో అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

 

చంద్రబింబం మూసినంత మేర మూయగా.. దాని చుట్టూ కనిపించే సూర్యగోళం మండుతున్న ఉంగరంలా కనిపిస్తుంది. దీన్నే వలయాకార గ్రహణం అంటారు.   ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో, హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల్లోని దీవుల్లో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. మిగిలిన చోట్ల కేవలం పాక్షిక సూర్యగ్రహణమే  కనిపిస్తుంది. ఒక సెకను నుంచి 12నిముషాల వ్యవధి మధ్యలో ఈ వలయాకార గ్రహణ సమయం ఉండే అవకాశం ఉంది.

 

ఈ వలయాకార సూర్యగ్రహణం .. కరోనా వైరస్ పైనా ప్రభావం చూపుతుందా అంటే ... దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. నిపుణులు అలాంటిదేమీ ఉండదని చెబుతుండగా., కొందరు ఆధ్యాత్మికవాదులు మాత్రం..సూర్యగ్రహణం మేలు చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు గ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఈ రోజు రాత్రి నుంచి పలు ఆలయాలు మూతపడనున్నాయ్‌. శ్రీకాళహస్తిలో మాత్రం గ్రహణం వేళ ప్రత్యేక పూజలు జరగనున్నాయి. మొత్తానికి ఈ సూర్యగ్రహణాన్ని చూసేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అందుకోసం కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు. మండుతున్న సూర్యగోళం ఉంగరంలా ఎలా ఉండబోతోందో అనే ఉత్కంఠ వారిలో నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: