రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు అధికార పార్టీలోకి జంప్ అవ్వడం సహజమే. అయితే పార్టీ మార్పులు ఎప్పుడు ఆఫర్ల కోసమే జరుగుతుంటాయి. కానీ “అధికార పార్టీ అద్భుతంగా అభివృద్ధి చేస్తుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అందుకే పార్టీ మారుతున్నామని”...పార్టీ మారే ప్రతి నాయకుడు ఇవే డైలాగులు చెబుతారు. అయితే అసలు విషయం మాత్రం వారి వ్యాపారాల కోసం, భవిష్యత్‌లో పదవులు కోసం పార్టీలు మారతారు. ఇలాంటి ఆఫర్లతోనే గతంలో టీడీపీలోకి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చేరారు. ఇంకా చాలామంది నేతలు కూడా వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లారు.

 

ఇక అలా పార్టీ మారినవారి పరిస్తితి ఏమైందో ఎన్నికల్లో చూశాం. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి కూడా వలసలు అలాగే జరుగుతున్నాయి. కానీ ఎమ్మెల్యేలు చేరిక విషయం మాత్రం వెరైటీగా జరుగుతుంది. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు తమ పదవులు పోకుండా, వైసీపీలో చేరకుండా జగన్‌కు సపోర్ట్ చేశారు. కాకపోతే ఇలా చేసినా కూడా వారు వైసీపీ వాళ్లే అని అర్ధమైపోతుంది. ఆ విషయం పక్కనబెడితే గత కొన్నిరోజుల నుంచి రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా పార్టీ మారనున్నారని వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఆ వార్తలని ఆయన ఖండించి టీడీపీలో ఉంటానని చెబుతూనే, పార్టీకు మాత్రం అందుబాటులో ఉండలేదు. ఏదో సాకు చెబుతూ మొన్న మహానాడు, తాజాగా రాజ్యసభ ఎన్నికలకు డుమ్మా కొట్టారు. అనగాని ఇలా చేస్తుండటంతో టీడీపీ కార్యకర్తలు అనుమానంగానే ఉన్నారు. ఈయన ఎప్పటికప్పుడో పార్టీ మారిపోతారని అనుకుంటున్నారు. ఇదే సమయంలో ఈయనకు జగన్ మంచి ఆఫర్ కూడా ఇచ్చారని చర్చించుకుంటున్నారు.

 

అనగాని వైసీపీలోకి వస్తే రేపల్లెలో పెత్తనం దక్కుతుంది. ఎందుకంటే అనగాని మీద పోటీ చేసి ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లారు. దీంతో రేపల్లెపై పెత్తనంతో పాటు, నెక్స్ట్ టర్మ్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. కాకపోతే రేపల్లెలో టీడీపీకి బలం ఎక్కువ. కాబట్టి నెక్స్ట్ వైసీపీలోకి వెళితే గెలుపు గురించి కాస్త ఆలోచించుకోవాలి. దీంతో ఇటు ఆఫర్...అటు గెలుపు గురించి ఆలోచించుకుంటూ ఏం చేయాలో తోచక అనగాని కన్ఫ్యూజన్‌లో ఉన్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: