తెలంగాణలో కరోనా కేసులు కొన్ని రోజులుగా చాలా ఎక్కువగా వస్తున్నాయి. మొదట్లో కాస్త తక్కువగానే ఉన్నా.. ఇప్పుడు రోజూ వందల్లోనే కొత్త కేసులు వస్తున్నాయి. వాటిలో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ లాక్ డౌన్ ఎత్తేసిన నేపథ్యంలో ఇప్పుడు కరోనా కేసులు ఇతర జిల్లాలలకూ వ్యాపిస్తున్నాయి.

 

 

మొదట్లో ఒక్క హైదరాబాద్ లోనే నూటికి 90 శాతం కేసులు ఉండేవి. లాక్ డౌన్ ఎత్తివేత, ఆర్టీసీ సర్వీసుల ప్రారంభం తర్వాత కేసులు జిల్లాలకు పాకుతున్నాయి. శనివారం అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఏకంగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

 

 

 

అందులోనూ ఎక్కువగా.. అంటే.. జీహెచ్ఎంసీ పరిధిలో 458 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. ఇక పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో 50 మందికి కరోనా వైరస్ సోకింది. కొన్నాళ్లుగా కేసులు లేని కరీంనగర్ జిల్లాలోనూ కొత్తగా కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో 13 కొత్త కేసులు వచ్చాయి. ఆ తర్వాత జనగామ జిల్లాలోనూ మరో పది కొత్త కేసులు వచ్చాయి.

 

 

ఇవే కాకుండా.. మహబూబ్ నగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ , ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోనూ కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తంతో కేసుల సంఖ్య 7,072కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి తెలంగాణలో 203 మంది మృతి చెందారు. కరోనా నుంచి 3,506 మంది కోలుకోగా.. 3,363 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మరి పరిస్థితి ఇలాగే ఉంటే.. తెలంగాణ మరో మహారాష్ట్ర అవుతుందేమో అన్న భయాందోళనలు ప్రజల్లో నెలకొంటున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: