తెలుగుదేశం పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారనే వార్తలు ఎప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. ఆ లిస్టు లో ఉండే మొట్టమొదటి పేరు గంటా శ్రీనివాసరావు. టిడిపి అధినేత చంద్రబాబు సైతం గంటా పార్టీ మారుతారని విషయాన్ని బలంగా నమ్ముతారు. 2019 ఎన్నికలకు ముందు నుంచి గంటా పార్టీని వీడుతారనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. ఆయన జనసేన వైపు కానీ, వైసీపీ వైపు గాని వెళ్తారనే అంతా అనుకున్నారు. కానీ ఆయన టిడిపిని వీడలేదు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన దగ్గర నుంచి అదిగో వెళ్ళిపోతున్నాడు.. ఇదిగో వెళ్ళిపోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. పార్టీలోనే ఉన్నారు. ఆయనపై ఇప్పటికీ నమ్మకం లేదు. ఆయన ఎప్పుడైనా పార్టీ మారుతారని భావిస్తూ వస్తున్నారు. 

 


ఈ విషయంలో గంటా మౌనంగానే ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రతిష్టాత్మకంగా జరిగిన మహానాడు కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యారు. ఇక రాజ్యసభ అభ్యర్థుల ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ కు గంటా  శ్రీనివాస రావు గైర్హాజరవుతారని అందరూ అంచనా వేశారు. కానీ ఆయన ఓటింగ్ లో పాల్గొని టిడిపి అభ్యర్థికి ఓటు వేశారు. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, పార్టీ మారే ప్రసక్తి లేదని గంటా పదేపదే బహిరంగంగా చెబుతున్నారు. అయినా ఎవరికి నమ్మ బుద్ధి కావడం లేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఆయన పార్టీ మారుతారని అంతా ఒక అంచనాకు వచ్చేసారు. 

 


అధికార పార్టీ వైపు వెళ్తారని ప్రచారం జరుగుతున్నా, ఇప్పటికే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గంటాను  పార్టీలో చేర్చుకునేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ మారాలని అనుకున్నా, మారేందుకు కూడా సరైన వేదిక లేకపోవడంతోనే సైలెంట్ అయిపోయినట్టు కనిపిస్తోంది. ఆయనకు ఉన్న ఏకైక ఆప్షన్ బీజేపీ మాత్రమే. కానీ ఆ దిశగా ఆయన అడుగులు వేయడం లేదు. ప్రస్తుతానికి తెలుగుదేశంలోనే ఉండాలని ఆయన డిసైడ్ అయినా ఆయనపై మాత్రం ఎవరికి నమ్మకం లేకుండా పోవడమే విచిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: