వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి చైనా దుర్బుద్ధి బయటపడుతూనే ఉంది. తాజాగా ఈశాన్య లద్దాఖ్‌ ప్రాంతంలో గల్వాన్‌ నదిని కప్పేయడానికి లేదా నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి చైనా పెద్దఎత్తున ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఎన్‌డీటీవీ’ సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. దాడికి తెగబడిన ప్రాంతానికి కిలో మీటరు లోపలే ఆ దేశం ఈ దురాగతానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చైనా వైపు ఎల్‌ఏసీ వెంబడి భారీగా బుల్డోజర్లు మోహరించి ఉన్నాయి. ఆ ప్రాంతంలో గల్వాన్‌ నదీ ప్రవాహ గతి కూడా మారుతోంది.

 


భారత్‌ వైపు ఎల్‌ఏసీ ప్రాంతానికి వచ్చేసరికి నీటి ప్రవాహం కుంచించుకుపోవడమే కాకుండా బురదగా కనిపిస్తోంది. 5 కి.మీ.లకు పైగా చైనా ట్రక్కులు, సైనిక వాహనాలు, బుల్డోజర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. గల్వాన్‌ ఘటనతో ఏమాత్రం తగ్గకుండా భారత సైనికాధికారులు మంగళవారం ఉదయం ఆర్మీ కంబాట్‌ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గల్వాన్‌ నదిపై తలపెట్టిన వంతెన నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి’ అనేది ముఖ్యమైన విషయం. వెంటనే రంగంలోకి దిగిన ఇంజనీర్లు, సిబ్బంది వెంటనే పనులు మొదలుపెట్టారు.72 గంటల పాటు కొనసాగించి, గురువారం మధ్యాహ్నం కల్లా పూర్తి చేశారు.రెండు గంటలపాటు వాహనాలను నడిపి విజయవంతంగా పరీక్షించి చూశారు.

 


వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు బలగాలు వేగంగా చేరుకునేందుకు ఈ వంతెన కీలకంగా మారనుంది. ఈ వంతెనతో దర్బాక్‌ నుంచి దౌలత్‌ బేగ్‌ ఓల్దీ వరకు 255 కిలోమీటర్ల మేర రహదారిని భారత్‌ కాపాడుకోగలదు. భారత్, చైనాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గల్వాన్‌ నది పరీవాహక ప్రాంతంలో మన దేశం చేపట్టిన నిర్మాణాల్లో ఈ వంతెన కూడా ఒకటి. 60 మీటర్ల పొడవైన ఈ బెయిలీ(ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే వీలున్న) వంతెనపై ఫిరంగి దళ వాహనాలతోపాటు ఇతర అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: