ప్రస్తుతం అందరి దృష్టి కరోనా పైనే ఉంది. ఎందుకంటే ఎటు నుంచి ఈ మహమ్మారి ముంచుకొస్తుందో తెలియని భయంతోనే అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక మరోవైపు వృత్తిఉద్యోగాల రీత్యా బయటికి వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ తమ పనులను కొనసాగిస్తున్నారు చాలామంది. అయితే ఈ వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా విస్తరించే ప్రమాదం ఉంది. ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం.. వంటివి మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటాయి. అసలే కరోనాతో సతమతమవుతున్న ఈ రోజుల్లో మనం అప్పుడో ఇప్పుడో తుమ్మినా, దగ్గినా అది కరోనానేమో అని భయపడిపోతున్నాం. మరి, ఇలాంటి గడ్డు కాలంలో ఎలాంటి ఫ్లూ లక్షణాలు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి, అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా..!

 

 

వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల కలరా, విరేచనాలు, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మనం తాగే నీరు ఫిల్టర్‌ అయినప్పటికీ వాటిని బాగా మరిగించుకొని గోరువెచ్చగా అయ్యాక తాగడం మంచిదంటున్నారు నిపుణులు. అది కూడా రోజుకు రెండుమూడు లీటర్లు తాగడం తప్పనిసరి.. ఇంకా అందులో నిమ్మరసం పిండుకుంటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇలా గోరువెచ్చటి నీళ్లు తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. అంతేకాదు.. గోరువెచ్చగా ఉండే నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కరోనాకు దూరంగా ఉండచ్చని ఇప్పటికే నిపుణులు పలు సూచనల్లో భాగంగా చెప్పిన సంగతి తెలిసిందే. 

 

 

కాలం మారుతున్న కొద్దీ మనం అప్రమత్తంగా ఉండకపోతే సీజనల్‌ వ్యాధులు అటాక్‌ చేయడానికి రడీగా ఉంటాయి. మనం వాటికి ఆ అవకాశం ఇవ్వకూడదనుకుంటే మన ముందున్న ఏకైక మార్గం రోగనిరోధక వ్యవస్థను దృఢంగా ఉంచుకోవడం. అది మనం రోజూ తీసుకునే ఆహారం వల్లనే సాధ్యమవుతుంది. ఇందుకోసం విటమిన్‌ ‘సి’ అధికంగా ఉండే కమలాఫలం, బత్తాయి, అరటి, కివీ.. వంటి పండ్లతో పాటు టొమాటో, ఆకుకూరలు, క్యాబేజీ.. వంటి కాయగూరల్ని సైతం రోజువారీ మెనూలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: