స‌రిహ‌ద్దు వ‌ద్ద చైనా ఆగ‌డాలకు అడ్డుక‌ట్ట వేసేందుకు భార‌త ఆర్మీకి కేంద్ర ప్ర‌భుత్వం పూర్తి స్వేచ్ఛ‌ను క‌ల్పించింది. ఎలాంటి నిర్ణ‌య‌మైనా తీసుకోవ‌డానికి..శ‌త్రు దేశాన్ని ఎదుర్కొవ‌డానికి అనుస‌రించాల్సిన మార్గాల‌పై, నిర్ణ‌యాధికారాలు క‌ల్పిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల జారీ చేసింద‌ని ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. గాల్వాన్ లోయలో భారత,  చైనా ఘర్షణాత్మక వైఖరి నేపథ్యంలో ఆర్మీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ క్రమంలో తూర్పు లద్దాఖ్‌‌లో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారత త్రిదళాధిపతి(సీడీఎస్) బిపిన్‌ రావత్‌తో పాటు త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. 


ఈ సందర్భంగా చైనా దాడులను తిప్పికొట్టాలని, వారి ప్రతి కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నియంత్రణ రేఖ వెంబడి దళాల మోహరింపుతో పాటు, సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వీరందరూ సమీక్షించినట్లు సమాచారం.ఇరు దేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం తలెత్తేలా ప్రవర్తించకూడదని, ఒకవేళ చైనా మాత్రం అందుకు తగ్గ వాతావరణం కల్పిస్తే మాత్రం... ఏమాత్రం వెనక్కితగ్గకుండా దీటైన స‌మాధానం ఇవ్వాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, చైనాకు తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.


  ఇదిలా ఉండ‌గా రక్షణ మంత్రి మాస్కో పర్యటనకు బయల్దేరే ఒక్క రోజు ముందు కేంద్రం ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవ‌డం ఇప్పుడు అంత‌ర్జాతీయ స‌మాజాన్ని ఆలోచ‌న‌లో ప‌డేసింది.  మరోవైపు గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 ప్రాంతంలో భారత సైన్యం పట్టు సాధించింది. ఇదిలావుంటే రష్యాలో నిర్వహించే విక్టరీ డే పరేడ్‌ కు హాజరు కావడానికి మంత్రి రాజ్‌నాథ్ సోమవారం బయలుదేరి వెళతారు. అక్కడ జూన్ 24న జరిగే పరేడ్‌ లో పాల్గొంటార‌ని  స‌మాచారం. భార‌త‌ త్రివిధ దళాలూ చైనా విషయంలో అత్యంత జాగరూకతతో ఉండాలని, చైనా విషయంలో కఠిన వైఖరి అవలంబించాల‌ని త్రివిధ ద‌ళాదిప‌తుల‌కు రాజ్‌నాథ్ సూచించిన‌ట్లుత స‌మాచారం.  ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సైన్యమే సొంత నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీ కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: