గతంలో అమెరికా, కెనడా, ఇటలీ దేశాల్లో కరోనా వైరస్ ఎలా విజృభించిందో మన దేశంలో కూడా అదే స్థాయిలో ఉగ్రరూపం దాల్చుతోంది అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడిన బాధితులు సరైన మందులు లేక హాస్పటల్లో మగ్గిపోతున్నారు. ఇదే పరిస్థితి అన్ని దేశాల్లో నెలకొన్న నేపథ్యంలో... వైద్య రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కరోనా వైరస్ విరుగుడు పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా దేశాల్లో ఇప్పటికే ఎన్నో సంస్థలు తాము కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టామని ప్రకటించాయి కానీ అవేమీ రోగులపై సరైనా సానుకూల ప్రభావం చూపలేకపోతున్నాయి. 


ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన హెటిరో ఫార్మా కంపెనీ కరోనా వైరస్ సోకిన రోగులకు నయం చేసేందుకు జనరిక్ మందును కనిపెట్టామని ప్రకటించింది. ఆదివారం నాడు హెటిరో ఫార్మా కంపెనీ అధికారులు మాట్లాడుతూ... తాము కనిపెట్టిన కోవిఫర్(COVIFOR) మందు తయారు చేసేందుకు... కరోనా రోగులకు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో విడుదల చేసేందుకు కూడా డీసీజీఐ అనుమతి లభించినట్లు తెలిపారు. ఈ ఫార్మా కంపెనీ తయారు చేసిన జనరిక్ మందు 'కోవిఫర్ 100 ఎంజీ' అనే బ్రాండ్ నేమ్ తో ఇంజెక్షన్ రూపంలో మార్కెట్ లోకి విడుదల కానున్నది. కరోనా పీడితులకు, కరోనా అనుమానితులకు కూడా చికిత్స చేసేందుకు ఈ కోవిఫర్ 100 ఎంజీ మందు ని ఉపయోగించవచ్చని ఫార్మా సంస్థ వెల్లడించింది. 


హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బి పార్థసారధి రెడ్డి మాట్లాడుతూ... కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కోవిఫర్ మందు తయారీకి అనుమతి రావడం సంతోషకరం. కోవిఫర్ మందు రోగులపై సానుకూల ఫలితాలను చూపిస్తుంది. ఈ మందు ఖచ్చితంగా ప్రస్తుత విపత్కర పరిస్థితులను నుండి మన అందరిని గట్టెక్కిస్తుంది. కోవిఫర్ మందుని దేశవ్యాప్తంగా కరోనా పీడితులందరికీ పంపిణీ చేయగల సామర్థ్యం మాకు ఉంది. భవిష్యత్తులో కరోనా వైరస్ బారిన పడేవారి కోసం కూడా ఈ మందులను ఎక్కువ సంఖ్యలో తయారుచేస్తాం', అని చెప్పుకొచ్చారు. 


ఇకపోతే కోవిఫర్ 100 ఎంజీ ఇంజక్షన్ ఐదు వేల నుండి ఆరు వేల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. కోవిఫర్ 100 ఎంజీ ఇంజక్షన్ తో కేవలం ఆస్పత్రిలో వైద్యులు మాత్రమే చికిత్స చేయగలరు. ఎందుకంటే ఈ జనరిక్ మందులు కేవలం కొవిడ్-19 ఆస్పత్రిలకు మాత్రమే ఇవ్వబడతాయి. వైద్యులు కూడా రోగుల అనుమతి తీసుకుని కోవిఫర్ 100 ఎంజీ ఇంజక్షన్ తో చికిత్స చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: