గత పదేళ్లలో దేశంలో సాఫ్ట్ వేర్ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. సాఫ్ట్ వేర్ కంపెనీలు ఐదంకెల జీతం ఆఫర్ చేస్తూ ఉండటంతో యువత కూడా ఆ ఉద్యోగాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈసీఈ, సీఎస్సీ బ్రాంచ్ లతో పాటు ఇతర బ్రాంచ్ లను ఎంచుకున్న వారు కూడా కోర్సులు నేర్చుకుని ఈ రంగంలో జాబ్ సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట తక్కువ జీతంతో కెరీర్ మొదలైనా అనుభవం పెరిగే కొద్దీ లక్షల్లో జీతం వచ్చే అవకాశాలు ఉండటంతో ఈ రంగంపై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతోంది. 
 
అయితే ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. గతంలో ఫ్యాక్టరీలలోని కార్మికులతో గంట సమయం ఎక్కువగా పని చేయించుకుంటే ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు కార్మిక వ్యవస్థ కాకుండా కార్పొరేట్ సెక్టార్లు దేశాన్ని శాసిస్తున్నాయి. కరోనా విజృంభణ సాఫ్ట్ వేర్ కంపెనీల యజమానులకు వరంగా మారగా ఉద్యోగులకు మాత్రం శాపంగా మారింది. లాక్ డౌన్ సమయంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకోవడంతో పాటు తక్కువ జీతం చెల్లించారు. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ లాక్ అమలవుతోంది. ఇప్పటికి కూడా మెజారిటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించుకున్నాయి. అయితే ఆఫీసుల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఓవర్ టైమ్ పని చేస్తే జీతాలు ఎక్కువగా ఇచ్చేవారు. రోజుకు 8 గంటలు మాత్రమే అక్కడ సాధారణంగా పని చేయాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగులు 12 నుంచి 14 గంటలు పని చేస్తున్నారు. శని, ఆదివారాలు గతంలో వారికి సెలవులు ఉండేవి. 
 
ఇప్పుడు శని, ఆదివారాల్లో వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు చదువుల్లో మేధావులు... ఆలోచనల్లో మేధావులు. బ్రతకటంలో  మేధావులు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంది. వారు తీవ్ర మానసిక వేదనకు గురి కావడంతో పాటు దానికి తగిన వేతనం చెల్లించడం లేదు. ప్రస్తుతం వారు బానిసల్లా బ్రతుకుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: