భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 15,413 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పటివరకు 4 ల‌క్ష‌లు దాటిన కేసులతో ఆందోళన నెలకొంది.  మృతుల సంఖ్య మొత్తం  13,254కి  పెరిగింది. 1,69,451 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,27,756 మంది కోలుకున్నారు.  ఈ క్రమంలో  అమెరికాలోని మిచిగాన్ యూనివ‌ర్సిటీకి చెందిన‌ భారత సంత‌తి అధ్య‌య‌న‌కారిణి భ్ర‌మ‌ర్ ముఖ‌ర్జీ ఓ బాంబులాంటి వార్త చెప్పారు.

 

జూలై 1 నాటికి ఈ భారత్‌లో కేసుల సంఖ్య 6 ల‌క్ష‌లకు చేరుకుంటుంద‌ని వెల్ల‌డించారు. దేశంలో ర్యాపిడ్ ప‌రీక్ష‌ల సంఖ్యను పెంచ‌డం అవ‌స‌ర‌మ‌ని ఆమె తెలిపారు.  దేశంలో అధిక‌ జ‌నాభాపై స‌ర్వే చేయ‌డం వల్ల ఎంత‌మందికి క‌రోనా సోకుతుందనేది గుర్తించే అవ‌కాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.  ఇక భార‌త్‌లో కేవ‌లం 0.5 శాతం జ‌నాభాకు మాత్ర‌మే ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వ్యాధి నిర్ధార‌ణ‌కు ఆర్టీ-పీసీఆర్ టెస్టింగ్‌ల‌పైనే ఆధార‌ప‌డ‌కుండా ఇతర మార్గాలు అన్వేషించాలి. ల‌క్ష‌ణాలు గుర్తించేందుకు ఉష్ణోగ్ర‌త ప‌రిశీలించ‌డం, ఆక్సిజ‌న్ చెక్ చేయ‌డం, కాంటాక్టుల‌ను గుర్తించ‌డం ఎంతో అవసరం’ అని అన్నారు.  మనం వైర‌స్ వ్యాప్తిని మంద‌గించేలా చేశాం కానీ పూర్తిగా నిర్మూలించ‌లేదని.. అయితే న్యూజిల్యాండ్ లాగా భార‌త్ క‌రోనాను పూర్తిగా నియంత్రించ‌‌క‌పోవ‌చ్చని అనుమానం వ్యక్తంచేశారు.

 

లాక్‌డౌన్‌తో ఇత‌ర దేశాల్లో క‌రోనా కేసులు త‌గ్గితే, దురదృష్టవశాత్తూ భార‌త్‌లో మాత్రం పెరుగుతున్నాయని వాపోయారు.  మరోవైపు భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లు మానవాళిని కబళించే అవకాశం ఉందని, అప్రమత్తం కాకుంటే తీవ్ర నష్టం తప్పదని వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ఇంటర్నేషనల్‌ హెచ్చరించింది. ఈ మేరకు ‘కోవిడ్‌–19: అర్జెంట్‌ కాల్‌ టు ప్రొటెక్ట్‌ పీపుల్‌ అండ్‌ నేచర్‌’ తాజా నివేదికలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: