జగన్ గాలిలో సైతం వైసీపీని ధీటుగా ఎదురుకుని టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. అయితే గెలిచిన 23 మందికి చెక్ పెట్టడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ పావులు కదుపుతున్నారు. వీలున్న చోట ఎమ్మెల్యేలని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కరణం బలరామ్, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు టీడీపీని వీడారు.

 

మరికొందరు ఎమ్మెల్యేలని కూడా లాగేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక కొన్నిచోట్ల ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడానికి బలమైన నాయకులని బరిలో ఉంచడానికి చూస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీలో బలంగా ఉన్న మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుకు కూడా చెక్ పెట్టడానికి జగన్...అదే టీడీపీ నుంచి వచ్చిన తోట త్రిమూర్తులని రంగంలోకి దింపారు.

 

మొన్న ఎన్నికల్లో త్రిమూర్తులు టీడీపీ తరుపున రామచంద్రాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయి, తర్వాత వైసీపీలోకి వచ్చారు. వైసీపీలోకి రాగానే ఆయనకు...జగన్ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే మండపేటలో వేగుళ్ళ చేతిలో ఓడిపోయిన డిప్యూటీ సీఎం పిల్లి సుబాష్ చంద్రబోస్‌ని రాజ్యసభకు పంపనున్న నేపథ్యంలో, తోటకి మండపేట బాధ్యతలు అప్పజెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి తోట అక్కడ పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా తోటనే మండపేట బరిలో ఉండొచ్చని తెలుస్తోంది.

 

అయితే తోట...వేగుళ్ళకు చెక్ పెట్టడం కష్టమని, ఇక్కడ జగన్ ప్రయోగాలు ఫలించవని తెలుస్తోంది. ఎందుకంటే వరుసగా మండపేట నుంచి మూడుసార్లు గెలిచిన వేగుళ్ళకు..నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. వివాదరహితుడిగా ఉన్న ఈయన, అన్ని వర్గాల ప్రజలని కలుపుని వెళుతున్నారు. పైగా నియోజకవర్గంలో కమ్మ ఓట్లు ఎక్కువ. ఇదే సమయంలో శెట్టిబలిజలు తోటకు పూర్తి వ్యతిరేకం. దీంతో శెట్టిబలిజలు కూడా వేగుళ్ళ వైపే ఉంటారు. ఇక కాపులు మాత్రం తోట వైపు ఉండొచ్చు. మొత్తానికి చూసుకుంటే తోట కంటే వేగుళ్ళ అన్నీ విధాలా మెరుగైన వ్యక్తి. కాబట్టి మండపేటలో వేగుళ్ళకు చెక్ పెట్టడం అంత సులువైన పని కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: