కరోనా కట్టడి అంశంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైరస్‌ నియంత్రణకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని బీజేపీ అంటే... కేంద్రం, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఏం చేసిందని టీఆర్ఎస్ ప్రశ్నించింది. 

 

కరోనా కట్టడిపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల నేతలు... ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా... పార్టీ వర్చువల్‌ ర్యాలీలో విమర్శించారు. వైరస్‌ను ఏ దశలోనూ నియంత్రించ లేకపోయారంటూ... టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. చిన్న రాష్ట్రాల కంటే తక్కువ టెస్టులు చేస్తున్నారని విమర్శించారు నడ్డా. 

 

బీజేపీ విమర్శలపై టీఆర్ఎస్ భగ్గుమంది. కరోనా వ్యాపిస్తున్న వేళ పార్లమెంట్‌ను నడిపింది, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టే పనిలో బిజీగా ఉన్నదీ బీజేపీయేనని అన్నారు మంత్రి ఈటల. కరోనాకు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం సరైన సాయం అందించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎమ్ఆర్ టెస్టుల విషయంలో కుప్పిగంతులు వేసిందని... అయినా తెలంగాణ రాష్ట్రం వాటిని పాటించిందని చెప్పారు.  ఈటల. కరోనా కట్టడిలో తెలంగాణ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని, ముందు బీజేపీ  పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని సూచించారు ఈటల.

 

మంత్రి హరీష్‌రావు కూడా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. సరిహద్దుల్లో సైనికులు.. కరోనాపై పోరులో వైద్యులు ఒక్కటేనన్న ఆయన... వైద్యుల సేవలను తక్కువ చేసి చూపడం సరైనదేనా? అని ప్రశ్నించారు. కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతా అంటూ కౌంటర్ ఇచ్చారు. జేపీ మాటలు వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు... హరీష్‌రావు.

 

గతంలో కూడా వివిధ అంశాలపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం నడిచింది. ఇప్పుడు కరోనా కట్టడి విషయంలో మొదలైన మాటల యుద్ధం... ముందుముందు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: