స‌రిహ‌ద్దులో వీర‌మ‌ర‌ణం పొందిన క‌ల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్  రేపు స్వయంగా సాయం అందించనున్నారు. సూర్యాపేటలోని సంతోష్‌బాబు ఇంటికి వెళ్లి... ఆయన భార్యకు గ్రూప్‌ వన్‌ స్థాయి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగ నియామక పత్రాలు, రూ.5 కోట్ల చెక్కు, నివాస స్థలం డాక్యుమెంట్లు ఇవ్వనున్నారు కేసీఆర్.

 

సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేట వెళ్లనున్నారు. చైనా సైనికులతో ఘ‌ర్షణ‌లో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామ‌ర్శించ‌నున్నారు. సంతోష్‌బాబు భౌతికకాయం హైద‌రాబాద్ చేరుకున్న రోజు గ‌వ‌ర్నర్ త‌మిళిసై, మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. అంత్యక్రియ‌లకు ప్రభుత్వం త‌ర‌పున మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పుడు సీఎం కేసీఆర్... స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి క‌ుటుంబసభ్యులను కల‌వాల‌ని నిర్ణయించుకున్నారు. 

 

క‌ల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం త‌ర‌పున ఇప్పటికే సాయాన్ని ప్రక‌టించారు సీఎం కేసీఆర్. ఐదు కోట్ల రూపాయ‌లు, హైద‌రాబాద్‌లో నివాస‌ స్థలం ఇవ్వబోతున్నారు. వీటితో పాటు సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్ వ‌న్ స్థాయి ఉద్యోగం ఇవ్వాల‌ని నిర్ణయించారు. డిప్యూటీ క‌లెక్టర్ ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు, న‌గ‌దు చెక్కు, నివాస స్థలం ప‌త్రాల‌ను... కేసీఆర్, సంతోష్ బాబు కుటుంబ స‌భ్యుల‌కు అంద‌చేస్తారు. సీఎం కేసీఆర్ ప్రక‌టించిన సాయాన్ని సంతోష్‌బాబు కుటుంబం స్వాగతించింది. 

 

క‌ల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియ‌లు నిర్వహించి‌న చోట స్మార‌క‌స్థూపం నిర్మించాల‌ని కుటుంబం కోరుతోంది. అలాగే అందరికీ స్ఫూర్తినిచ్చేలా సూర్యాపేటలో సంతోష్‌బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయాల‌ని సీఎంను కోర‌నున్నారు. 

 

కల్నల్ సంతోష్ బాబు మృతి యావత్ దేశాన్ని కదిలించింది. సగటు మనిషి కన్నీరు పెట్టేలా చేసింది. చైనా చేసిన దాష్టికానికి మన దేశ పౌరుల్లో రక్తం మరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం చైనాపై ఎలా కక్ష తీర్చుకుంటుందో అనే విషయంపై ఆసక్తిగా గమనిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: