ఏపీలో కరోనా ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. గత 24 గంటల్లో మరో 477 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల ఐదుగురు చనిపోయారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలులో,చిత్తూరు జిల్లాలో ఒకరు చొప్పున మృత్యువాత పడ్డారు. 

 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కృష్ణా, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో మరణాలు ఆగడం లేదు. గడిచిన 24గంటల్లో 477 కరోనా కేసులు నమోదవ్వగా, మొత్తం బాధితుల సంఖ్య 8 వేల 929కి చేరింది. 

 

నమోదైన 477 కరోనా కేసుల్లో  రాష్ట్రానికి చెందిన వారు 439 మంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 34 మందికి కరోనా సోకింది. ఇక గడిచిన 24 గంటల్లో 151 మంది కోవిడ్ నుండి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా... చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అందులో కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు,  కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 106 మంది వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

 

రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క రోజులో అత్యధికంగా 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  మొత్తం కేసులు 555కి చేరాయి. అందులో 258 కేసులు యాక్టివ్. 292 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం ఐదుగురు చనిపోయారు. 

 

66 పాజిటివ్ కేసులతో కృష్ణా జిల్లా రెండో స్థానంలో నిల్చింది. జిల్లాలో మొత్తం కేసులు 1048కి చేరాయి. 559 కేసులు యాక్టివ్. 453మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు చనిపోయిన ముగ్గురితో కలిపితే.. జిల్లాలో కరోనా మరణాలు 36కి చేరాయి. 

 

తొలి నుంచీ కరోనా ప్రభావం అధికంగా ఉన్న కర్నూలు జిల్లాలో.. ఇప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 47 కేసులు నమోదయ్యాయి.  దాంతో జిల్లాలో పాజిటివ్ కేసులు 1,294 కు చేరాయి. ఒకరు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 34కి చేరింది.  528 కేసులు యాక్టివ్ అయితే, 732 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

 

ఉత్తరాంధ్రలో కరోనా విజృంభిస్తోంది. కరోనా వ్యాపించిన తొలి రెండు నెలల్లో గ్రీన్‌జోన్లుగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పోలీసు శాఖలో సైతం కేసులు నమోదవుతుండటంతో అధికారులను కలవరపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: