ఏపీలో ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో కేబినెట్లో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో వాటిని భర్తీ చేసేది ఎవరు? ఛాన్స్‌ దక్కేది ఎవరికి అన్నదానిపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. 

 

మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవడంతో... ఏపీ కేబినెట్‌లో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.  దాంతో... వారి స్థానంలో కేబినెట్‌లోకి ఎవరు వస్తారనే అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేబినెట్‌లో వెంటనే చేర్పులు ఉంటాయా? లేక కొంత సమయం తీసుకుంటారా? అనే అంశంపైనా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. 

 

ప్రస్తుతం మంచి రోజులు లేకపోవడంతో రెండు నెలల పాటు కేబినెట్‌లో కొత్తవారికి చోటు ఉండకపోవచ్చనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు సమాచారం. రాజ్యసభకు వెళ్లినా 6 నెలల పాటు మంత్రులుగా కొనసాగే వెసులుబాటు ఉండటంతో... ఆ ప్రత్యామ్నాయాన్ని కూడా అధికార పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఖరారైతే మరికొన్ని రోజులు పిల్లి సుభాష్, మోపిదేవి మంత్రులుగా కొనసాగే అవకాశం ఉంది. 

 

మంత్రి పదవుల రేసులో ప్రతి జిల్లా నుంచి ఆశావహులు ఉన్నారు. ఏ మాత్రం అవకాశం లభించినా కేబినెట్లో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. అయితే కేబినెట్‌లో చేర్పులకే పరిమితం అవుతారా? మార్పులు ఉంటాయా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. శాఖల మార్పులకూ ఆస్కారం ఉంటుందా? అనే అంశంపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. శాఖల్లో మార్పులు చేర్పులుంటే రెవెన్యూ శాఖను బుగ్గన లేదా పెద్దిరెడ్డికి అప్పగించే అవకాశం ఉందంటున్నాయి... పార్టీ వర్గాలు.

 

తూర్పుగోదావరి జిల్లా  నుండి రాష్ట్ర మంత్రి వర్గంలో  ప్రాతినిధ్యం  వహిస్తున్న   రెవెన్యూశాఖ మంత్రి  పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నికల కావడంతో   జిల్లా నుంచి మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.    దీంతో జిల్లాలోని   వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. బీసీ కోటాలో ఖాళీ అవుతున్న పీఠం కావడంతో  ఆ సామాజిక వర్గానికి చెందిన  ఎమ్మెల్యేల్లో పలువురు  ఆశతో ఉన్నారు.  జిల్లాలో  ఖాళీ అయిన మంత్రి పదవిని  బిసి సామాజిక వర్గానికి చెందిన వారికే  అవకాశం ఇస్తారా..?  లేక  కొత్తవారికి ఆ అదృష్టం దక్కుతుందా..? అనే   చర్చ కూడా  జోరుగా  సాగుతోంది.

 

బీసీ సామాజిక వర్గానికి సంబంధించి  వైసిపి నుండి జిల్లాలో ఇద్దరు  ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.  వీరిలో  ఒకరు ముమ్మిడివరం  ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్,   రామచంద్రాపురం  ఎమ్మెల్యే చెల్లుబోయిన  శ్రీనివాస వేణుగోపాలకృష్ణ  . ఈ ఇద్దరిలో  ఒకరికి   మంత్రి పీఠం దక్కుతుందని  జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పొన్నాడకే ఎక్కువ ఆవకాశాలు అంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఇలాంటి చర్చలకు తెర పడాలంటే మరికొన్నిరోజులు వేచి చూడక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: