మనసు కళ్లెంలేని గుర్రం లాంటిది. అదుపు చేసే సాధనం లేకపోతే తలాతోకా లేకుండా ఆలోచనలు పరుగులు తీస్తూనే ఉంటాయి. అందుకే మానసికంగా... శారీరకంగా... ఆధ్యాత్మికంగా... సర్వరోగ నివారిణిలా మారింది యోగా.  60 వేల  సంవత్సరాల చరిత్ర కలిగిన యోగా.. అంతర్జాతీయ ఖ్యాతిపొందింది. 

 

చేస్తున్న పనిలో ప్రావీణ్యతను సంపాదించడమే యోగం. మనిషి నిమిషానికి నాలుగు ఆలోచనలు చేస్తాడని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. 12 గంటల జాగృతావస్థలో... మనిషి రోజూ వందల ఆలోచనలు, ఏడాదిలో ఎన్నో లక్షలు, కోట్లాది ఆలోచనలు చేస్తాడు. మనిషి దృష్టిలోని అన్ని ఆలోచనల నుంచి ఒకే విషయం వైపు మళ్ళించే ప్రయత్నమే యోగా. దేవుణ్ణి నమ్మని నాస్తికులుండవచ్చు. కానీ... సూర్యుణ్ణి నమ్మని వారుండరు. కులం, మతం, ప్రాంతం, భాష,ఆస్తి లాంటి తారతమ్యాలు లేకుండా సూర్య భగవానుడు అందరికీ వెలుగుల్ని పంచుతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యం అంటే..  శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పరిపుష్టి. ఊబకాయం, అధిక రక్తపోటు, కీళ్ళ నొప్పులు, ఆధునిక జీవితంలో ప్రతి ఆరోగ్య సమస్యకు సూర్య నమస్కారాల్లో పరిష్కారం ఉందంటున్నారు. సూర్య నమస్కారాల్లో అనేక ఆసనాలున్నాయి.

 

సూర్యుడి నుంచి వచ్చే డి విటమిన్ ఎముకల్ని గట్టి పరుస్తుందని... శ్వాస సంబంధ వ్యాధులు, 'ఇ' విటమిన్‌ వల్ల నేత్ర సంబంధ వ్యాధులు దూరమవుతాయని... శరీరంలో 97 శాతం కండరాలలో కదలిక వస్తుందంటున్నారు వైద్యులు. భారత్‌లో యోగాకు బాబారామ్‌దేవ్ కొత్త జవసత్త్వాలిచ్చారు. పతంజలి యోగ పీఠం ద్వారా దేశమంతా యోగా శిబిరాల నిర్వహణ ద్వారా మంచి ప్రాచుర్యంలోకి తెచ్చారు. 2011, 2013ల్లో అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించి.. ప్రపంచవ్యాప్తంగా, శాస్తవ్రేత్తలు, యోగ నిపుణులను పిలిచి యోగా విశేషాల్ని విశ్వానికి చాటారు. పరిశోధనలకై శాస్తవ్రేత్తల్ని ప్రోత్సహించారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, టెక్సాస్‌ నుంచి కూడా శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు. పతంజలి యోగాపీఠంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు.

 

అమెరికాలోని శ్యాన్‌సోన్ స్టేట్ యూనివర్సిటీలో కూడా యోగాపై అధ్యయనం జరిగింది. ఉజ్బెకిస్థాన్
లోని తాష్కెంట్ నగరంలో కూడా పరిశోధనలు జరిగాయి. జీవ ప్రక్రియలతోపాటు గుండె పనితీరు కూడా యోగాతో మెరుగుపడిందని ప్రకటించాయి. జపాన్ తదితర అనేక దేశాల యోగ కేంద్రాల్లో సూర్యనమస్కారాల్ని నేర్పుతున్నారు. సిక్స్ ప్యాక్ మోజులో ఉన్న కుర్రకారు సైతం... జిమ్ వీడి యోగా బాటపడుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. అమెరికాలోని 100 నగరాలలో యోగధాన్ కూడా నిర్వహించారంటేనే యోగాకి లభించిన ప్రాచుర్యం తెలుసుకోవచ్చు. 

 

యోగాను శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి. ఉపనిషత్తులలోను, భగవద్గీతలోను యోగా ప్రస్తావన ఉంది. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకే ఉందని పరిశోధనల్లో తేలింది. భారతదేశంలో పురుడుపోసుకున్న యోగా నేడు ప్రపంచమంతా పాకింది. భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన యోగావిద్యను యావత్ ప్రపంచం ఎప్పటి నుంచో అనుసరిస్తోంది. యోగా అనే పదం సంస్కృతం నుంచి వచ్చిందంటున్నారు పండితులు. యుజ అనే పదం నుంచి వచ్చింది. యుజ అంటే దేన్నైనా ఏకం చేయడం.. లేదా చేరడం అని అర్థం. అంటే.. శరీరాన్ని, మనసును ఏకం చేయడమే యోగా ఉద్దేశం అన్నమాట. అందుకే.. ఆ యోగాకు ఆ పేరు వచ్చిందని చెప్తున్నారు.

 

జూన్ 21..కి మరో చరిత్ర కూడా చెప్తారు. ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉంటుంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో.. అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోడీ సూచించారని చెప్తున్నారు. 

 

యోగా వల్ల శారీరక దార్ఢ్యం పెరుగుతుంది. కండరాలు, ఎముకల పనితీరు మెరుగవుతుంది. గుండె కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహం, శ్వాసకోశ సంబంధ సమస్యలు, అధిక రక్తపోటు, అలాగే ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే అనేక ఇబ్బందులకు యోగా మంచి పరిష్కారం అంటున్నారు వైద్యులు. మానసికంగా నిరాశా నిస్పృహలు, అలసట, మానసిక ఆందోళన, ఒత్తిడి లాంటి వాటన్నిటికీ ఇది పరమౌషధం యోగా. దేహాన్నీ, మనస్సునూ నియంత్రణలోకి తెస్తూ... ఆరోగ్యానికీ, మానసిక శ్రేయస్సుకూ సమగ్రమైన విధానం ఈ ప్రాచీన భారతీయ యోగశాస్త్ర విజ్ఞానమేనని ఇప్పుడు ప్రపంచమంతా అంగీకరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: