ఎట్టి పరిస్థితుల్లోనూ, విశాఖను పరిపాలన రాజధాని చేయాలనే పట్టుదలతో ముందు నుంచి వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తోంది. అమరావతిలో రాజధాని నిర్మాణం ఏర్పాటు అంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని, భారీగా భూ కుంభకోణాలకు పాల్పడడమే కాకుండా టీడీపీ నాయకులకు మేలు చేసేవిధంగా ఎన్నో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిలో నిర్మాణాలు చేపట్టడం భారీ ఆర్ధిక భారంతో కూడుకున్నది కాబట్టి అక్కడ ఇప్పటికిప్పుడు రాజధాని ఏర్పాటు చేయడం కుదిరే పని కాదు అనే అభిప్రాయానికి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో వచ్చేసింది. అందుకే అన్ని వసతులు ఉన్న విశాఖను రాజధానిగా చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంటూ వైసీపీ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. 

 

IHG


ఈ మేరకు విశాఖ లో రాజధాని తరలింపు ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తుండగానే, ఆకస్మాత్తుగా కరోన ఎఫెక్ట్ తగలడంతో ఆ పనులకు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజధాని విషయం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాజధాని తరలింపుపై ఎటువంటి ఆలోచన చేయడం లేదని చెప్పుకొచ్చారు. జూలైలో కరోనా కేసులు రెట్టింపు లేదా మూడు రెట్లు పెరుగుతాయని నిపుణులు సూచిస్తుండడంతో ఇప్పుడు రాజధాని తరలింపు గురించి పట్టించుకోవడంలేదని, అన్ని వ్యవహారాలు సద్దుమణిగిన తరువాత రాజధాని వ్యవహారంపై మాట్లాడుతామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రకటించారు.

 

IHG


 ఇంత అకస్మాత్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలంతా కరోనా ఆందోళనలో ఉన్నారు. ఇంకా అనేక చోట్ల లాక్ డౌన్ నిబంధనలు అమలు అవుతున్నాయి. అంతేకాకుండా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఊహించని విధంగా రోజురోజుకు రెట్టింపు అవుతుండడం, పట్టణాల నుంచి పల్లెల్లోకి ఈ కేసులు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలు ప్రభుత్వాన్ని  కూడా కలవరపెడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని తరలింపు చేపడితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: