ఇటు భార‌తీయులు, అటు భార‌త ప్ర‌భుత్వం చైనాకు షాకులు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.  సరిహద్దుల్లో చైనా దుశ్చర్య నేపథ్యంలో ఆ దేశ వస్తూత్పత్తులను కొనే ముచ్చటే లేదని ఓ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 87 శాతం మంది తేల్చిచెప్పారు. 20 మంది సైనికులను బలిగొన్న చైనాకు వాణిజ్యపరంగా బుద్ధి చెప్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్‌ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న చైనాకు, దాని తొత్తులకు బుద్ధి చెప్పేందుకు ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సరిహద్దును పంచుకొంటున్న దేశాల నుంచి పెన్షన్‌ ఫండ్స్‌లోకి వచ్చే పెట్టుబడులపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 

 


ప్రస్తుతం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే పెట్టుబడులకు మాత్రమే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే, తాజాగా జారీ చేసి ముసాయిదా నోటిఫికేషన్‌లో ఆర్థిక శాఖ కీల‌క విధానాలు ప్ర‌తిపాదించింది. ‘చైనా సహా భారత్‌తో సరిహద్దును కలిగివున్న దేశాల సంస్థలు లేదా వ్యక్తుల నుంచి వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానానికి సంబంధించిన కొత్త నిబంధనలు ఇలాంటి పెట్టుబడులన్నింటికీ వర్తిస్తాయి’ అని తేల్చిచెప్పింది. తాజాగా ఆర్థిక శాఖ చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఇకపై చైనా, నేపాల్‌తోపాటు మయన్మార్‌, భూటాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ కూడా ఈ జాబితాలోకి వస్తాయి. దీంతో చైనాకు ఇంకో రూపంలో షాక్ త‌ప్ప‌నిస‌రి. 

 

కాగా, చైనా ప‌ట్ల ఇప్ప‌టికే భార‌తీయులు త‌మ గ‌లాన్ని వినిపించిన సం‌గ‌తి తెలిసిందే. దేశంలోని 235 జిల్లాల్లో లోకల్‌ సర్కిల్స్‌  సర్వే చేపట్టగా, 32వేల మందికిపైగా పాల్గొన్నారు. వీరిలో షియామీ, వివో, ఒప్పో వంటి చైనా బ్రాండ్లను బహిష్కరించాలని 97 శాతం మంది కోరగా, 39 శాతం మంది ఇప్పటికే కొన్నవి వాడుతామని, ఇకపై మాత్రం కొనబోమన్నారు. చైనా దిగుమతులపై 200 శాతం సుంకాలను విధించాలని 78 శాతం భారతీయులు డిమాండ్‌ చేయగా, ముడి సరుకు దిగుమతులపై ఇంతటి భారం తగదని 36 శాతం అభిప్రాయపడ్డారు. బీఐఎస్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తదితర భారతీయ ప్రమాణాలను చైనా కంపెనీలు తప్పక పాటించాల్సిందేనని 90 శాతం మంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: