జగన్ భారీ మెజారిటీతో గెలిచి..సీఎం పీఠంలో కూర్చుని ఏడాది దాటుతుంది.  ఇక ఈ ఏడాది కాలంలో జగన్ పనితీరుకు మంచి మార్కులే పడుతున్నాయి. మొత్తానికి చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చిన వైసీపీనే మళ్ళీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రాగలదని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పుంజుకుందా? అనే ప్రశ్న తలెత్తితే ఇంకా లేదనే సమాధానం వస్తుంది. అసలు 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్రతి జిల్లాలోనూ దారుణమైన ఫలితాలు వచ్చాయి.

 

13 జిల్లాలో కలిపి 23 సీట్లు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతానికి కూడా టీడీపీ కొన్ని జిల్లాలో ఇంకా దారుణమైన పరిస్థితినే ఎదురుకుంటుంది. కాకపోతే కొన్ని జిల్లాల్లో కీలకమైన స్థానాల్లో  మాత్రం టీడీపీ పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటగా భావించే కృష్ణా జిల్లాలో టీడీపీ కొన్ని చోట్ల పుంజుకున్నట్లే తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఎన్నికల్లో వైసీపీ 14 సీట్లు గెలిస్తే, టీడీపీ కేవలం 2 చోట్ల గెలిచింది.

 

అయితే గెలిచిన రెండు చోట్లలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాత్రం వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇక మరో సీటు విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అటు ఓడిపోయిన స్థానాల్లో విజయవాడ సెంట్రల్‌, పెనమలూరు, మచిలీపట్నం, పెడన స్థానాల్లో టీడీపీ కాస్త బలం పుంజుకున్నది.

 

ఇక్కడ నాయకులు యాక్టివ్‌గా ఉండటం వల్ల పార్టీ కాస్త బలోపేతం అయింది. ఇక ఊహించని విధంగా మైలవరం నియోజకవర్గంలో కూడా టీడీపీ పరిస్థితి మెరుగుపడిందని తెలుస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమా నిత్యం ప్రజల్లో ఉండటం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం కలిసొస్తుంది. ఇదే సమయంలో ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పనితీరు అంత గొప్పగా ఏమి లేదని తెలుస్తోంది. అందుకే ఇక్కడ టీడీపీ పుంజుకుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

 

ఇక నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి పర్వాలేదు. అయితే అవనిగడ్డ, నూజివీడు, గుడివాడ, పామర్రు, తిరువూరు, కైకలూరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో ఇంకా దారుణంగానే ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: