అమర వీరుడు కర్నల్‌ సంతోష్‌బాబుకు ‘భారత్‌ టైగర్‌’ బిరుదు ప్రదానం చేయనున్నట్లు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ (వామ్‌) ప్రకటించింది. ఈ మేరకు వామ్‌ గ్లోబల్‌ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ, కార్యదర్శి పసుమర్తి మల్లికార్జునరావు, కోశాధికారి ఎల్‌.వి.కుమార్‌ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌ అనుమతిస్తే సొంత ఖర్చులతో సంతోష్‌బాబుకు తెలంగాణలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. భారత్ చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సోమ‌వారం మిర్యాల‌గూడకు  సీఎం కేసీఆర్ స్వ‌యంగా వెళ్లి ప‌రామ‌ర్శించారు. 

 

క‌ల్న‌ల్ సంతోష్ భార్య సంతోషితో మాట్లాడిన కేసీఆర్‌.. ఆమెకు గ్రూప్ వ‌న్‌ జాబ్ అపాయింట్ ఆఫ‌ర్‌ను అంద‌జేశారు. అంతేకాకుండా కుటుంబానికి అయిదు కోట్ల‌ రూపాయ‌ల చెక్‌ను కూడా అంద‌జేశారు. జూబ్లీ హిల్స్‌లో 700 గ‌జాల ఇంటి స్థ‌లాల ప‌త్రాల‌ను కూడా సీఎం కేసీఆర్‌.. క‌ల్న‌ల్ సంతోష్ కుటుంబానికి అంద‌జేస్తాన‌ని చెప్పిన విష‌యం తెలిసిందే.  ఇదిలా ఉండ‌గా సంతోష్ కుటుంబాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కూడా పెద్ద ఎత్తున ఆదుకునేందుకు ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా చైనా సైన్యం దురాక్ర‌మ‌ణ, వెన్నుపోటు దాడిలో నేల‌కొరిగిన భ‌ర‌త‌మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు మ‌ర‌ణంపై ర‌క్ష‌ణ అధికారులు మ‌రింత వివ‌ర‌ణ ఇచ్చారు. 

 

అతని పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమంటూ, ఆసలు ఈ నెల 15న చైనా బలగాలతో జరిగిన ఘర్షణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికార వర్గాలు వెల్లడించాయి. తమ కంటే ఎక్కువ సంఖ్యలో చైనీయులు విరుచుకుపడుతున్నా భారత సైన్యం వెనక్కు తగ్గకపోగా చైనీయుల చేతుల్లోని ఇనుప రాడ్లు, మేకులతో కూడిన గదల్లాంటి ఆయుధాలను లాక్కుని ప్రతిదాడికి దిగారని, ఈ క్రమంలో పెట్రోల్‌ పాయింట్‌ 14 వద్ద కనీసం 40 మంది చైనీయులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. సంతోష్‌బాబు వీర పోరాట ప‌టిమ భార‌త‌దేశ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని ర‌క్ష‌ణ రంగ ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: