కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై మామూలుగా లేదు. కంటికి కనిపించని ఈ శత్రువు జీవితాలను చిన్నాభిన్నం చేసింది. దేశాల ఆర్థిక వ్యవస్థలను అంధకారంలోకి నెట్టింది. దేశాలవే కాదు ప్రజల ఆర్థిక పరిస్థితులూ దిగజారాయి. చాలామంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.  రెండు నెలలకు పైగా లాక్ డౌన్ అమల్లో ఉండటంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, టిఫిన్ సెంటర్లు, టీ కొట్లు నడిపే వారు లాస్ అయ్యారు. విద్యాసంస్థలు మూతపడటంతో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. దీంతో వారు ప్రత్యామ్నాయంపై ఫోకస్ పెట్టారు.  పండ్లు, కూరగయాలు, ఆకుకూరలు అమ్ముకుంటున్నారు.  నెల్లూరులోనూ అదే జరిగింది.. లాక్‌డౌన్ దెబ్బకు ఓ టీచర్ బతుకుచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.. కుటుంబ పోషణ కోసం రోడ్లపై అరటిపళ్లు అమ్మాల్సి వస్తోంది.

 

నెల్లూరు వేదాయపాళెంకు చెందిన పట్టెం వెంకటసుబ్బయ్య ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, ఎంఏ తెలుగు, బీఈడీ పూర్తిచేశారు. కొత్త అడ్మిషన్లు చేర్చడానికి టార్గెట్‌ పూర్తి కాకపోవడం, స్మార్ట్‌ ఫోన్‌ కూడా మొరాయించడంతో విద్యా సంస్థ యాజమాన్యం ఆయన్ను పక్కనపెట్టింది. దాంతో ఆయన రోడ్డుపై అరటి పండ్లు అమ్మారు.. ఈ విషయం తెలుసుకొని పూర్వ విద్యార్థులు కొంత మేర ఆర్థిక సహాయం అందించారు. తాజాగా  అనంతపురంలోనూ ఇలాంటిదే జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్‌గా పని చేస్తున్న వ్యక్తి కూరగాయలు అమ్ముకుంటున్నాడు. అతని పరిస్థితి పలువురిని కలిచి వేసింది.

 

కంబదూరు మండలం నూతిమడుగులో మురళీమోహన్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఫుల్ టైమ్ గెస్ట్ టీచర్‌గా పనిచేస్తున్నారు.  మూడు నెలలుగా జీతాలు లేకపోవడం, పాఠశాలల ప్రారంభానికి ఇంచా చాల సమయం ఉండటంతో కుటుంబ పోషణ చాలా ఇబ్బంది అయ్యింది. చేసేదేమి లేక సంతలో కూరగాయలు అమ్మడం మొదలు పెట్టారు. విద్యాబోధన చేయాల్సిన వ్యక్తి ఇలా కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించడం ప్రైవేటు టీచర్ల బతుకుచిత్రానికి నిదర్శనంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: