జగన్ అప్రతిహతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఆయనకు వచ్చిన సీట్లూ, ఓట్లూ ఉమ్మడి ఏపీ చరిత్రలోనే నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. ఇక జగన్ ఏడాది పాలన కూడా సంక్షేమ రాజ్యంగానే సాగింది. జగన్ పాలన బాగుందని, మరో నాలుగు శాతం ఎక్కువగా ఓట్లు ఆయన సాధించారని ఒక సర్వే ఈ మధ్యనే ఫలితాలను వెల్లడించింది.

 

మరి ఇంత బలవంతుడిగా ఉన్న జగన్ కానీ వైసీపీ కానీ కేవలం ముగ్గురు వ్యక్తుల సమావేశం గురించి ఇంతలా కంగారు పడాల్సిన అవసరం ఉందా. ఆ ముగ్గురూ ఏకంగా వైసీపీ సర్కార్ని కూల్చగలిగే కెపాసిటీ ఉన్నవారా. ఇపుడు వారి గురించి ఆలోచిస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక బ్యూరోక్రాట్. ఆయన ఇపుడు రాజ్యాంగబధ్ధ పదవిలో ఉన్నారు. సరే ఆయన ఎంత చెప్పుకున్నా రాజకీయ నాయకుడు మాత్రం కాదు, పైగా మరో ఎనిమిది నెలల్లో ఆయన పదవి కూడా ముగుస్తుంది.

 

మరొకరు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి. ఆయన తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్లారు. అయితే ఆయనకు కేంద్ర నాయకత్వం దగ్గర ఏపీ సర్కార్ని కూల్చేసే అంత పలుకుబడి ఉందంటే ఎవరూ నమ్మరు. ఏపీలో కానీ దేశంలో కానీ ఎందరో సీనియర్ మోస్ట్ బీజేపీ నేతలు ఉన్నారు. సుజనా చౌదరి కూడా వారిలో ఒక నాయకుడు, అయితే ఆయన రాజ్యసభ సభ్యుడు.

 

ఇక మరొకరు చంద్రబాబు క్యాబినెట్లో అయిదేళ్ల పాటు వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. మరి ఆయనే అంత రాజకీయ పలుకుబడి ఉంటే పోటీ చేసేవారు, గెలిచేవారు కూడా. ఇలా ఈ ముగ్గురూ కూడా వారి వారి పరిధుల్లో ఉన్న వారు. వారికి ఏపీవ్యాప్తంగా బలాలూ లేవు, బలగాలూ లేవు. అయితే వారు ముగ్గురూ కలసి చర్చించేది కచ్చితంగా నిమ్మగడ్డను తిరిగి పదవిలో కూర్చోబెట్టే వ్యవహారం అయి ఉంటుంది. ఏది జరిగినా కోర్టుల ద్వారానే ఇపుడు జరగాలి.దానికి సంబంధించిన ప్రోసెస్ ఏమైనా చర్చించుకుటే అందులో తప్పులేదు కూడా. 

 


ఇక నిమ్మగడ్డ ఫలనా పార్టీ అని అంటగట్టినా ఆయన ఇంతకు ముందు కూడా టీడీపీతోనే ఉన్నారని అన్నారు కాబట్టి ఇపుడు ఇదిగో బీజేపీతో ఉన్నారు అని చెప్పడానికి రుజువుగా వాడుకోవాలి, ఆ విధంగా రాజకీయ రచ్చ చేయడానికి తప్ప ఈ ముగ్గురు  కలయిక వల్ల వైసీపీకి ఏ విధంగానూ నష్టమూ లేదు, కష్టమూ లేదు. అయితే నిమ్మగడ్డను పార్టీ మనిషిగా చూపించి బురద‌ జల్లే ఎత్తుగడలో ఇదొక భాగం కావచ్చేమో. ఏది ఏమైనా నిమ్మగడ్డకు రాజకీయాలు తెలియవు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకుంటే సరిపోతుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: