యనమల రామకృష్ణుడు...తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ నేత. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో పనిచేసిన వ్యక్తి. ఇంకా ముఖ్యంగా ఎన్టీఆర్‌ని పదవి నుంచి దింపేటప్పుడు స్పీకర్ కుర్చీలో ఉండి ఏపీ రాజకీయాలని మార్చిన నేత. ఇక యనమల టీడీపీ తరుపున తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టారు.  తుని నుంచి 1983,85,89, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.

 

అయితే 2009 ఎన్నికల్లో మాత్రం యనమలకు అదిరిపోయే షాక్ తగ్లింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వెంకటకృష్ణంరాజు శ్రీరాజా వాత్సవాయి(రాజా అశోక్ బాబు) యనమలని చిత్తుగా ఓడించారు. ఇక 2014 ఎన్నికలకొచ్చేసరికి యనమల పూర్తిగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో యనమల తమ్ముడు యనమల కృష్ణుడు టీడీపీ తరుపున బరిలో దిగి, వైసీపీ అభ్యర్ధి దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు. కాకపోతే అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు, యనమలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, ఆర్ధిక శాఖని ఆయన చేతిలో పెట్టారు.

 

ఇక ఆ ఐదేళ్లు యనమల ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తే, ఇటు తునిలో ఆయన సోదరుడు కృష్ణుడు చక్రం తిప్పారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా ముందుకెళ్లారు. దాడిశెట్టి రాజా ఎమ్మెల్యేగా ఉన్నా సరే, అనధికార ఎమ్మెల్యేగా కృష్ణుడు ఆధిపత్యం చెలాయించారు. ఈ ఆధిపత్యం భరించలేకే 2019 ఎన్నికల్లో కూడా తుని ప్రజలు కృష్ణుడుని దారుణంగా ఓడించి, దాడిశెట్టిని మళ్ళీ గెలిపించుకున్నారు. ఇక ఇక్కడితో తునిలో యనమల ఫ్యామిలీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అర్ధమైపోతుంది.

 

భవిష్యత్‌లో యనమల ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఎన్నికల బరిలో నిలబడితే టీడీపీ గెలవడం కష్టమని క్లియర్‌గా తెలుస్తోంది. కానీ యనమల ఫ్యామిలీని దాటి చంద్రబాబు మరొకరికి టిక్కెట్ ఇవ్వలేరు. పైగా యనమల ఫ్యామిలీ మరో టీడీపీ నేతని ఎదగనివ్వలేదు. అందువల్ల నియోజకవర్గంలో టీడీపీకి మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇక ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే తునిలో టీడీపీ సర్దేసుకోవచ్చని తమ్ముళ్ళు అంటున్నారు. కాపులకు పట్టున్న చోట యనమల ఫ్యామిలీకి టిక్కెట్ ఇవ్వడమే తప్పని, కానీ యనమల వాళ్ళు మాత్రం మరో నాయకుడుని ఎదగనివ్వలేదని కాబట్టి బాబు దీని గురించి కొంచెం ఆలోచిస్తే బెటర్ అని చెబుతున్నారు.

 

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచి, మొన్న ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేసి మూడోస్థానంలో నిలిచిన రాజా అశోక్ బాబుని టీడీపీలోకి తీసుకొచ్చి నిలబడితే మంచి ఫలితం ఉంటుందని, వివాదరహితుడుగా ఉన్న అశోక్ బాబు అయితేనే దాడిశెట్టికి చెక్ పెట్టగలరని, అలా కాకుండా తుని ప్రజల అభిమానాన్ని పూర్తిగా కోల్పోయిన యనమల ఫ్యామిలీకి మళ్ళీ టిక్కెట్ ఇస్తే మాత్రం గెలుపు జన్మలో సాధ్యం కాదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: