చైనాకు షాకుల పరంప‌ర కొన‌సాగుతోంది. మొండిత‌నంతో లడఖ్‌లో ఇటీవల 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకొన్న చైనాపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతున్న సంగ‌తి తెలిసిందే. ఏకంగా ఆ దేశానికి చెందిన కంపెనీల‌కు పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు, లాభాల షాకులు త‌గులుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రూ.5,020 కోట్ల పెట్టుబడులతో చైనా కంపెనీలు చేపట్టాల్సిన మూడు ప్రాజెక్టులను నిలిపివేస్తున్నట్టు ఉద్ధవ్‌ థాక్రే సర్కార్‌ ప్రకటించింది. ఈ అవగాహనా ఒప్పందాల (ఎంవోయూల)పై ఈ నెల 15న సంతకాలు జరిగాయి. 

 

 

భారత్‌-చైనా స‌రిహ‌ద్దులోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణకు కొద్దిరోజుల ముందు ‘మాగ్నటిక్‌ మహారాష్ట్ర 2.0’ పేరుతో ఉద్ధవ్‌ థాక్రే సర్కార్‌ నిర్వహించిన ఇన్వెస్టర్ల మీట్‌లో ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. చైనాకు చెందిన గ్రేట్‌ వాల్‌ మోటర్స్‌రూ.3,770 కోట్లతో, పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ రూ.1,000 కోట్లతో, హెంగ్లీ ఇంజినీరింగ్‌ రూ.250 కోట్లతో ఈ ఒప్పందాలను కుదుర్చుకొన్నాయి. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులను నిలిపివేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకొన్నామని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్‌ దేశాయ్‌ వెల్లడించారు. అయితే ఈ మూడు ఒప్పందాలను రద్దు చేసినట్టు కాదని, ఈ ప్రాజెక్టులపై యథాతథ స్థితి కొనసాగుతుందని అధికారిక ప్రకటనలో వివరించారు. ఈ మూడు ప్రాజెక్టుల భవితవ్యంపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు ఆయన తెలిపారు.

 

లడఖ్‌లోని గల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల బలిదానం జరిగిన వారం తరువాత కూడా తమ సైనికులు ఎంత మంది చనిపోయారనే సంఖ్యను చైనా వెల్లడించకపోవచ్చు, కానీ మూడు రౌండ్ల‌‌ హింసాత్మక ఘర్షణల తరువాత ఇరు దేశాల మధ్య మృతదేహాల మార్పిడి సమయంలో భారత సైన్యం.. చైనాకు చెందిన 26 మంది సైనికుల మృతదేహాలు చైనాకు అప్పగించింది. దీని ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కూడా చేపట్టారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 70 మందికి పైగా గాయపడిన సైనికులను కూడా వారికి అప్పగించారు. ఈ సంఘటన జరిగిన వారం తరువాత కూడా చైనా తన నష్టాన్ని నివేదించడానికి ఇష్టపడలేదు. 

రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తరువాత చైనా సైనికుల మృతదేహాలను భారత సైన్యం గౌరవప్రదంగా చైనాకు అప్పగించింది. జూన్ 15 రాత్రి భారత దళాలతో జరిగిన ఘర్షణ తరువాత అనేక చైనా సైనికుల మృతదేహాలు గల్వన్ నది పెట్రోలింగ్ పాయింట్ 14 సమీపంలో నేలమీద చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి.. అనంతరం వారి ఆదేశాల మేరకు చనిపోయిన చైనా సైనికుల మృతదేహాలను భద్రంగా, గౌరవప్రదంగా అప్పగించారు. గాయపడిన దాదాపు 70 మంది నడవలేని స్థితిలో ఉన్నవారిని కూడా చైనాకు అంతే గౌరవంగా అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: