కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రైవేటు రంగంలో ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తి ఇచ్చింది. ఈ నిర్ణ‌యం నేప‌థ్యంలో తాజాగా, కరోనా పరీక్షలు చేస్తున్న ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ ప్రతినిధులతో మంత్రి ఈటల, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కీల‌క సూచ‌న చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దని ఆయ‌న కోరారు.

 

క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించే ల్యాబ్‌ల ప్రతినిధులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఈటల సూచించారు. ``సాధారణ పరీక్షలకు కొవిడ్ పరీక్షలకు చాలా తేడా ఉంది. ఇక్కడ సర్వైలెన్స్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాలు ఇమిడి ఉంటాయన్నారు. కావున పాజిటివ్ వచ్చిన ప్రతి పేషెంట్ వివరాలు పోర్టల్ లో అప్లోడ్ చెయ్యాలి. వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలి` అని మంత్రి సూచించారు. పరీక్షలకు వచ్చిన ప్రతి ఒక్కరి రిజల్ట్స్ వచ్చే వరకు ఐసొలేషన్ లో ఉండాలని వారికి సూచించాలన్నారు. ప‌రీక్షలు ఇంటికి వచ్చి చేస్తామని, ఇంకా ఏ ఇతర పద్ధతుల్లో కూడా మార్కెటింగ్ చేయొద్దని మంత్రి ఈట‌ల కోరారు. విమాన ప్రయాణికులకు లక్షణాలు లేకపోయినా కరోనా పరీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చుకోవచ్చని తెలిపారు. పరీక్షలు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ లకు పూర్తి స్థాయిలో పీపీఈ కిట్స్ ఉపయోగించేలా చూడాలని లేదంటే వారికి కరోనా సోకవచ్చున‌ని.... లేదా వారి ద్వారా మిగిలిన వారికి కూడా సోకే అవకాశం ఉందని మంత్రి ఈట‌ల అన్నారు. కాగా, ప్ర‌స్తుత త‌రుణంలో మంత్రి ఈట‌ల స‌ల‌హా ఉప‌యుక్త‌మైన‌ది ప‌లువురు అంటున్నారు.

 

ఇదిలాఉండ‌గా, తెలంగాణ‌ రాష్ట్రంలో మంగళవారం పెద్ద ఎత్తున కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. న‌గ‌రంలో 879 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో 713 కేసులు హైదరాబాద్‌ గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు 9553 పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఇవాళ వైరస్‌తో మరో ముగ్గురు మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 220కి చేరింది. ఇప్పటి వరకు 4224 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా, 5109 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీలో 652 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ జిల్లాలో 112 , రంగారెడ్డిలో 64, వరంగల్‌ రూరల్‌లో 14, కామారెడ్డిలో 10, వరంగల్‌ అర్బన్‌లో 9, జనగామలో 7,  నాగర్‌ కర్నూల్‌లో 4, సంగారెడ్డి, మంచిర్యాల, మహబూబాబాద్‌లో రెండు చొప్పున, మెదక్‌లో ఒకటి చొప్పున పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: