తెలంగాణ‌ రాష్ట్రంలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. మంగళవారం పెద్ద ఎత్తున కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. హైద‌రాబాద్‌ న‌గ‌రంలో 879 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో 713 కేసులు కేవలం హైదరాబాద్‌ గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే నమోదయ్యాయి.  హైదరాబాద్‌ శివార్లలోని బాలాపూర్‌, వనస్థలిపురం, సరూర్‌నగర్‌, మహేశ్వరం, కొండాపూర్‌ కొవిడ్‌ నిర్ధారణ కేంద్రాల్లో భారీ సంఖ్యలో స్థానికులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, పోలీసులు పరీక్షలు చేయించుకుంటున్నారు. బాలాపూర్‌ కేంద్రంలో పదిశాతం వరకు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అందులో 2 శాతానికి పైగా ఎలాంటి లక్షణాలు లేని వారుంటే.. మిగతా  స్వల్ప లక్షణాలున్న వారు ఉంటున్నారు. మొత్తం ఐదు కరోనా నిర్ధారణ కేంద్రాల్లో మూడు రోజులుగా ఇంత వరకు 2,178 మందికి పరీక్షలు చేయగా, అందులో 157 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

 

ప్రస్తుతం హైద‌రాబాద్‌లో నివ‌సించే వారు జాగ్ర‌త్తగా ఉండాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. లక్షణాలు లేకుండా, వైరస్‌ తక్కువ తీవ్రతతో హోం ఐసొలేషన్‌లో ఉన్న రోగులు  వైద్యులు ఇచ్చిన మందులతో పాటు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా సీ-విటమిన్‌ ఉన్న ఆహార పదార్థ్ధాలను అధికంగా తీసుకోవాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. బత్తాయి, నారింజ, జామ తదితర తాజా పండ్లతో పాటు కూరగాయలను తీసుకోవాలంటున్నారు. బాదాం, పిస్తా, కిస్‌మిస్‌ తదితర డ్రై ఫ్రూట్స్‌ తీసుకుంటే ఇంకా మంచిదని సూచిస్తున్నారు. అన్నం, రొట్టె వంటివి ఎప్పటికప్పుడు తయారు చేసుకొని వేడివేడిగా తినాలంటున్నారు. ఎలాంటి  లక్షణాలు లేని వారు, తక్కువ ఇబ్బందులు ఉన్న పాజిటివ్‌ రోగులు హోం ఐసొలేషన్‌లో ఉంటూ.. చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇంటి వద్ద సరైన సౌకర్యాలు లేని రోగులను అమీర్‌పేటలోని ప్రకృతి చికిత్సాలయమైన  ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. లక్షణాలు లేని రోగులకు ప్రత్యేక చికిత్స పెద్దగా అవసరం లేదని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు స్పష్టం చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: