ఇండియాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. లెక్కలు.. అంకెలు.. మారుతున్నాయో తప్ప రికార్డులు మాత్రం ఆగడం లేదు. ఏ రోజుకారోజు కొత్త రికార్డులు బద్దలవుతున్నాయి. దేశంలో నాలుగున్నర లక్షల దిశగా కేసులు పెరిగిపోతున్నాయి. 

 

భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల్లోనే రికార్డులను బ్రేక్‌ చేస్తూ విజృంభిస్తోంది కరోనా మహమ్మారి. దేశంలో ఒక్కరోజులో అత్యధికంగా 14 వేల 933 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 312 మంది మరణించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4లక్షల 40 వేల 215కి చేరింది. లక్షా 78 వేల 14 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 14 వేల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

కరోనా కేసుల్లో రాజధాని ఢిల్లీ దేశంలోనే రెండో స్థానానికి చేరింది. మొత్తం కేసుల సంఖ్య తమిళనాడును దాటేసింది. అక్కడ 62వేల 655 మందికి వైరస్‌ సోకింది. 2వేల 233 మంది చనిపోవడంతో కరోనా మరణాల్లోనూ ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. తమిళనాడులో 62వేల 87 మందికి ఇప్పటివరకు వైరస్‌ సోకినట్టు తేలింది. ఇక లక్షా 35వేల 796 కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. బెంగళూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో మరోసారి పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేయాలని యడియూరప్ప ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే తీవ్రత ఎక్కువగా ఉన్న నాలుగు ప్రాంతాలను సీల్ చేశామని.. పరిస్థితి ఇలానే కొనసాగితే నగరం మొత్తం లాక్‌డౌన్ విధించక తప్పదని మంత్రి శ్రీరాములు ప్రకటించారు.

 

పశ్చిమ బెంగాల్లోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు, సహా అన్ని విద్యాలయాలను వచ్చే నెల 31 వరకు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 30 వరకు ఉన్న ఆదేశాలను వచ్చే నెలాఖరుకు పొడిగించారు. రోజు వారీగా జరిగే తరగతులు తప్ప మిగతా కార్యకలాపాలన్నీ యథాతథంగానే కొనసాగుతాయని తెలిపింది. ఇక కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నవారికి సేవలు అందించడానికి ఆయా రాష్ట్రాలకు కేటాయించిన కొవిడ్‌ కేర్‌ కోచ్‌ల సేవలు ప్రారంభమైనట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మొత్తం 5వేల 231 బోగీలను తయారు చేసింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో 960 కోచ్‌లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. తెలంగాణలోని సికింద్రాబాద్‌, కాచిగూడ, ఆదిలాబాద్‌లలో 20 చొప్పున 60 కోచ్‌లు, ఏపీలోని విజయవాడలో 20 కోచ్‌లను సిద్ధం చేసినట్లు వివరించింది. 

 

దేశంలో లక్ష జనాభాకు ఒకరు కోవిడ్-19 వల్ల మృతి చెందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అత్యల్పమని స్పష్టం చేసింది. కేసులను సకాలంలో గుర్తించడం, కాంటాక్ట్ ట్రేసింగ్, సమర్థమైన క్లినికల్ మేనేజ్‌మెంట్ వల్ల మరణాల రేటు తగ్గిందని కేంద్రం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: