ఏపీలో రాజకీయాలు మామూలుగా లేవు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఈ యుద్ధంలో తెలుగుదేశం పార్టీని మట్టికురిపించాలని వైసిపి ప్లాన్ చేసుకుంటూ వస్తోంది. ఆ పార్టీకి బలమైన నాయకులందరినీ దూరం చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్న ఈ సమయంలో బిజెపి లో ఉన్న చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన అత్యంత సన్నిహితులైన సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస రావు తో కలిసి ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్  హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో భేటీ అవ్వడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ విషయంపై ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుజనాచౌదరి కలవడం వెనుక కారణాలు చాలానే ఉన్నట్లుగా వైసిపి చెబుతోంది. 


ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుల్లో పోరాడుతున్నారు. దీనికి సంబంధించిన లాయర్లు, న్యాయ నిపుణులను సమకూర్చే పని సుజనా చౌదరి తీసుకున్నట్లుగా వైసీపీ ఆరోపిస్తోంది. అసలు బిజెపిలోకి సుజనా చౌదరి వెళ్లడం వెనుక చంద్రబాబు ప్లాన్ ఉన్నదనేది అందరూ అనుమానించే విషయమే. కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రతి దశలోనూ సుజనాచౌదరి కాపాడుకుంటూ వస్తున్నారు అనే ప్రచారం లేకపోలేదు. సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు బిజెపిలోకి వెళ్ళినా, ఎక్కువగా చంద్రబాబుతోనే టచ్ లో  ఉంటూ, ఎప్పటికప్పుడు కేంద్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ చంద్రబాబు కు చేరవేస్తూ ఉంటారనేది బహిరంగ రహస్యమే. 

 


ఇక ఏపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని సుజనాచౌదరి ఎత్తుకున్నారని, సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరపున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ను సుజనా చౌదరి నియమించారని, ఆయన ఫీజు మొత్తం ఆయనే చెల్లిస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ వ్యవహారం ఇలా చాపకింద నీరులా సాగుతున్న సమయంలోనే, ఇప్పుడు ఈ ముగ్గురు పాక్ హయత్ హోటల్లో భేటీ అయిన దృశ్యాలు బయటకు రావడం తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఇబ్బందికర  పరిణామమే. ఇప్పుడు గట్టిగా ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయలేని పరిస్థితి. మొదటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు టిడిపి కి మధ్య సంబంధాలు ఉన్నాయని వైసీపీ చేస్తున్న వాదనకు ఇప్పుడు బలం చేకూర్చినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: