కరోనాకు మందు కనిపెట్టేశామని చాలా మంది ప్రకటించుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ఫార్మా కంపెనీలు తమ మందులను విడుదల చేశాయి. నిన్నటికి నిన్న బాబా రాందేవ్ బ్రాండ్ పతంజలి కూడా కరోనాకు మందు విడుదల చేసింది. ఈ మందు వేసుకుంటే కరోనా పూర్తిగా నయం అవుతుందని ప్రకటించింది.

 

 

అయితే బాబా రాందేవ్‌ కు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ప్రకటనపై ఆయుష్‌ శాఖ స్పందించింది. పతంజలి చేసిన ప్రకటనలోని వాస్తవాలు, వారి ఔషధానికి సంబంధించిన శాస్త్రీయ వివరాలు తమకు తెలియవని స్పష్టం చేసింది. కొవిడ్‌ కట్టడి కోసం తయారు చేశామని చెబుతున్న ఔషధం వివరాలు తమకు సమర్పించాలని ఆదేశించింది.

 

 

ఆ మందు పేరు ఏంటి.. పేరు, దానిలో వాడిన పదార్ధాలు ఏంటి.., పరిశోధన వివరాలు ఏంటి, పరిశోధన జరిగిన ప్రదేశం, దాని ప్రోటోకాల్‌ వివరాలు, నమూనా పరిమాణం, నైతిక కమిటీ అనుమతి వివరాలు ఇవన్నీ వీలైనంత త్వరగా సమర్పించాలని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ను ఆదేశించింది.

 

 

అంతే కాదు.. ఈ ఔషధాన్ని తాము సమగ్రంగా పరిశీలించే వరకు దాని ప్రచార కార్యక్రమాలను నిలిపివేయాలని పతంజలిని ఆదేశించింది. పతంజలి కనుగొన్నామని చెబుతున్న ఔషధానికి సంబంధించిన లైసెన్స్‌ వివరాలు, దానికి లభించిన అనుమతి పత్రాలను అందించాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి కూడా ఆయుష్‌ శాఖ సూచించింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: