సొంతపార్టీ పైన తిరుగుబావుటా ఎగురవేసిన నరసాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆయన అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం లోని లోపాలను ఎత్తి చూపిస్తూ వస్తున్నారు. దీంతో రఘురామ కృష్ణంరాజు పై సొంత పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ఆయనకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ వస్తున్నారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో రఘురామకృష్ణంరాజు పై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన సొంత పార్టీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందంటూ రఘురామ కృష్ణరాజు కొద్దిరోజుల క్రితం లోక్ సభ స్పీకర్ కు , జిల్లా ఎస్పీ సైతం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.


 లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో తనకు ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. ఆ లేఖను పరిశీలించిన తరువాత లోక్ సభ స్పీకర్ స్పందించారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు హోంశాఖ భద్రత కల్పించాలని ఆయన ఆదేశించారు. భద్రత కల్పించాలని స్వయంగా ఎంపీ కూడా కోరడంతో హోంశాఖ ఆయనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని నిర్ణయించింది. స్పీకర్ సూచన మేరకు సిఆర్పిఎఫ్ లేదా సిఐఎస్ఎఫ్ జవాన్లతో ఆయనకు భద్రత కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సొంత పార్టీ కార్యకర్తల నుంచి తనకు ముప్పు ఉందని రఘురామకృష్ణరాజు  కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరడం చర్చనీయాంశం అయ్యింది. 


సొంతపార్టీ పైన విమర్శలు చేస్తూ, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న రఘురామకృష్ణంరాజు బిజెపిలో చేరుతారని ప్రచారం చాలాకాలం నుంచి జరుగుతోంది. అందుకే వైసీపీ పై విమర్శలు చేస్తున్నారని ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. అప్పటికే ఆయనకు వైసిపి షోకాజ్ నోటీసు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, ఆయన బిజెపిలో చేరడం లాంఛనమే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: