ఆనాటి స్టార్ కథానాయకుడులో ఒక్కరు మురళి మోహన్. ఈయన సినిమాల్లో అతిధి నటులను చూసే ఉంటారు. కాసేపు అతిధి పాత్రలో అందరినీ మురిపించి, మరపిస్తుంటారు. అలాంటి పాత్రధారులు రాజకీయాల్లోనూ కనిపించడం సర్వసాధారణమే. రాజకీయాల్లో కూడా ఆయన సినిమా తరహా పాత్రను పోషించి నటనలో తనకు తిరుగులేదని నిరూపించారన్న అభిప్రాయం రాజమహేంద్రవరం వాసుల్లో వ్యక్తమౌతోంది. 

 

 

2009లో మాగంటి మురళీమోహన్ రాజమహేంద్రవరం లో రాజకీయంగా ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓటమిపాలయ్యారు. తరుచూ హైదరాబాద్ లొనే ఉన్నా… 2014 సార్వత్రిక ఎన్నికల వరకు దాదాపు ఆయన రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం లోనే ఉన్నారు. స్థానిక జెఎన్ రోడ్డులో సొంత ఇల్లుకూడా నిర్మించుకున్నారు.

 


ఆయన అభ్యర్థిత్వాన్ని సీనియర్ నాయకుడు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వంటి వారు వ్యతిరేకించినా.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు తన వ్యాపార భాగస్వామిగా ప్రచారం పొందిన మురళీమోహన్ కు ఎంపి సీటును కేటాయించారు. బిజెపితో పొత్తు, జనసేన పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం, కాస్త బలహీనమైన ప్రత్యర్థి బరిలో నిలవడం… అప్పటికీ క్షేత్రస్థాయిలో మురళీమోహన్ బలోపేతం కాకపోయినప్పటికీ ఆయన విజయం సునాయాసమైంది.

 

 

ఎంపిగా ఎన్నికైన నాటి నుంచి మురళీమోహన్ స్టైల్ కాస్త మారుతూ వచ్చింది. రాజమహేంద్రవరం కన్నా డిల్లీ, హైదరాబాద్ లోనే ఆయన ఎక్కువగా గడిపారన్న విమర్శలు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. మరోవైపు ఎంపిగా ఉన్న కాలంలో ఆయన ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లు, ఇతర ప్రాజెక్టులు కూడా కార్యాచరణలోకి రాలేదని ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు.

 

 

ఈనేపథ్యంలోనే 2019లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు మురళీమోహన్ ను పక్కనపెట్టారన్న వాదన ఉంది. ఆయన స్థానంలో రాజమహేంద్రవరం ఎంపి స్థానాన్ని ఆయన కాకుండా… ఆయన రాజకీయ వారసురాలిగా పేర్కొనే కోడలు రూపాదేవికి కేటాయించారు. ఆ ఎన్నికల్లో అందరూ అనుకున్నట్లే ఆమె ఘోరంగా ఓటమిపాలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: