ఏపీ రాజకీయాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ ముగిసేలా కనిపించడం లేదు. ఆయన చుట్టూనే అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీలు రాజకీయం నడుపుతున్నాయి. మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా నిమగడ్డ, బీజేపీ నేతలు సుజనా చౌదరీ, కామినేని శ్రీనివాస్‌లు పార్క్ హయత్‌లో కలవడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. చంద్రబాబుతో కలిసి జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి రాంబాబు లాంటి వారు మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో నిమగడ్డని కలిస్తే తప్పేంటి అని సుజనా, కామినేనిలు చెబుతున్నారు.

 

సరే ఈ ఎపిసోడ్ సంగతి పక్కనపెడితే, వైసీపీ మాత్రం వింత రాజకీయం చేస్తూ అసలు కథని పక్కదోవ పట్టిస్తుందని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. అయితే కరోనా నేపథ్యంలో మార్చి నెలలో నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేసిన విషయం తెలిసిందే. అదేంటి తమకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఎన్నికలు వాయిదా వేయడం ఏంటి? అసలు కరోనా కేసులు రాష్ట్రంలో లేకపోయినా నిమగడ్డ, కావాలనే తన సామాజికవర్గమైన చంద్రబాబు డైరక్షన్‌లో పనిచేస్తు ఎన్నికలని వాయిదా వేశారని..జగన్‌తో పాటు వైసీపీ నేతలంతా మూకుమ్మడిగా విమర్శలు చేశారు.

 

అప్పుడే ఎన్నికల నిర్వహించడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఆఖరికి సుప్రీం కోర్టుకు వెళ్ళిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చిందని తమ్ముళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇక తర్వాత నుంచి నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలుసు. నిమ్మగడ్డని మళ్ళీ ఎస్‌ఈ‌సిగా నియమించాలని హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో అనుకూలంగా తీర్పులు వచ్చాయి. అయితే ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇంకా నిమ్మగడ్డ వ్యవహారం సస్పెన్స్‌గానే ఉంది. కాకపోతే తాజాగా నిమ్మగడ్డ, సుజనా, కామినేనిలు భేటీ కావడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

 

అయితే ఈ ఎపిసోడ్ గురించి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిటీవీ డిబేట్‌లో మాట్లాడుతూ...వీరి భేటీ వెనుక పెద్ద కుట్ర ఉందని చెబుతూనే, కరోనా సమయంలో ఎన్నికలు వాయిదాని తప్పుబట్టలేదని, కాకపోతే తమని ఎందుకు సంప్రదించలేదనే అడిగామని చెప్పారు. ఇక దీనికి తమ్ముళ్ళు ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే కదా వైసీపీ చేసే వింత రాజకీయం అంటూ.. అసలు ఎన్నికలు వాయిదా వేశారని వైసీపీ నేతలు ఎంత రచ్చ చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారని, కోర్టులుకు వెళ్ళడం కూడా చూశారని, ఇంత చేసి కూడా ‘లోకల్’ కథని తమకు అనుకూలంగా మార్చుకుని చెప్పుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: